పూరి స్పీడ్ ఇష్టం... అడ్వాన్స్‌తో వెయిటింగ్
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తమ నిర్మాణంలో సినిమాలు మొదలు కాబోతున్నట్లుగా సురేష్ ప్రకటించారు.
By: Tupaki Desk | 6 Dec 2024 6:24 AM GMTప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 25 ఏళ్లు పూర్తి అయ్యింది. శ్రీ హరి హీరోగా సాంబయ్య సినిమాను నిర్మించి ఇండస్ట్రీలో నిర్మాతగా అడుగు పెట్టిన బెల్లంకొండ సురేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను టాలీవుడ్‌కి అందించిన విషయం తెల్సిందే. గత కొన్నాళ్లుగా నిర్మాణంకు దూరంగా ఉంటున్న బెల్లంకొండ సురేష్ తిరిగి సినిమా నిర్మాణంలో బిజీ కాబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తమ నిర్మాణంలో సినిమాలు మొదలు కాబోతున్నట్లుగా సురేష్ ప్రకటించారు. ఆయన పాతికేళ్ళ ప్రస్థానం నేపథ్యంలో పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... చెన్నకేశవ రెడ్డి సినిమా రీ రిలీజ్‌కి మంచి స్పందన రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. తాను నిర్మించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ రీ రిలీజ్ చేస్తానంటూ ప్రకటించారు. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాను రీ రిలీజ్ చేస్తానంటూ పేర్కొన్నారు. తన ఇద్దరు కొడుకులతో సినిమాలను చేస్తానంటూ పేర్కొన్న బొల్లంకొండ తనకు పూరి జగన్నాధ్ అంటే ప్రత్యేకమైన అభిమానం అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆయన స్పీడ్‌గా సినిమాలు చేసే విధంగా తనకు ఇష్టం అన్నాడు.
పూరి జగన్నాధ్ కేవలం 90 రోజుల్లోనే సినిమాలను పూర్తి చేయడం నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఆయనతో సినిమా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన ఓకే అంటే అడ్వాన్స్‌తో రెడీగా ఉన్నట్లుగా బెల్లంకొండ అన్నారు. వరుసగా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ పూరి జగన్నాధ్‌తో సినిమాలు అంటే నిర్మాతలు కాస్త వెనుకాడుతున్నారు. ఆయన ఎక్కువగా సొంత బ్యానర్‌లోనే సినిమాలను చేస్తున్నారు. కనుక బెల్లంకొండ సురేష్ ఆఫర్‌ను ఆయన స్వీకరిస్తారా, ఆయన ఇస్తానన్న అడ్వాన్స్‌ను తీసుకునేందుకు రెడీగా ఉన్నారా అనేది చూడాలి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ సినిమా నిర్మిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబో సెట్ కావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. పూరి జగన్నాధ్ హీరోల స్టార్‌డం మార్చగల సత్తా ఉన్న దర్శకుడు. ఆయన దర్శకత్వంలో సినిమా చేసేందుకు యంగ్ హీరోలు ఎవరైనా ఆసక్తి చూపిస్తారు. ఆయన సినిమా ఫలితాలను పట్టించుకోకుండా బెల్లంకొండ వారు ఆయన దర్శకత్వంలో సినిమాను చేస్తారా అనేది చూడాలి. వచ్చే ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ సురేష్ సినిమాలను నిర్మించబోతున్నారు. పూరి మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమాను మొదలు పెట్టలేదు.