మంత్రి పదవి నుంచి తొలగిస్తే బ్రతికిపోతా... హీరో సంచలన వ్యాఖ్యలు!
మలయాళ సినిమాల్లోని యాక్షన్ హీరో సురేష్ గోపీ... పలు పోలీస్ రిలేటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Aug 2024 10:55 AM GMTమలయాళ సినిమాల్లోని యాక్షన్ హీరో సురేష్ గోపీ... పలు పోలీస్ రిలేటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన సంగతి తెలిసిందే. ఇక "ఐ" సినిమాలో కంటికి కనిపించని విలన్ రోల్ లోనూ అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ నుంచి ఎంపీ అయ్యి.. అనంతరం కేంద్రమంత్రిగానూ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో... సినిమాలపై తనకున్న ప్యాషన్ గురించి చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... కేరళలోని తిస్సూర్ లోక్ సభ స్థానం నుంచి భారతీయ జనతాపార్టీ తరుపున ఎంపీగా ఎన్నికైన మలయాళ నటుడు సురేష్ గోపీ... ప్రస్తుతం నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖల సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... తనకు సినిమాలంటే ఎంత ఇష్టం అనే విషయాని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... తాను 22 సినిమాలు అని చెప్పగానే తాను ఇచ్చిన అభ్యర్థన లేఖను పక్కనపెట్టారని.. అయితే ఆ తర్వాత అనుమతి ఇస్తామని మాత్రం చెప్పారని.. దీంతో సెప్టెంబర్ 6 నుంచి ఒట్టకొంబన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని సురేష్ గోపీ వెళ్లడించారు.
షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించేందుకు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులను వెంట ఉంచుకుంటానని చెప్పారు. ఇదే సమయంలో... ఈ విధంగా తన పనులు చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పిన ఆయన... మంత్రి పదవిలో ఉండి షూటింగ్ లో పాల్గొన్నందుకు తనను ఆ పదవి నుంచి తొలగిస్తే.. "బ్రతికిపోయా" అని అనుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో తానెప్పుడూ మంత్రిని కావాలని అనుకోలేదని.. ఇప్పటికీ ఆ ఆశ ఏమీ లేదని.. ఆ విషయంలో పార్టీ పెద్దల ఆదేశాలను మాత్రమే అనుసరించానని.. తన కోసం కాకుండా తనను గెలిపించిన త్రిశ్శూరు ప్రజల కోసం ఈ పదవి ఇస్తున్నట్లు వారు చెప్పారని.. ఆ విధంగా కేంద్ర మంత్రి పదవికి తాను అందించినట్లు చెప్పారు. అలా అని తన అభిరుచి (సినిమా)కు దూరంగా ఉండమంటే మాత్రం తాను బతకలేనని సురేష్ గోపీ వ్యాఖ్యానించారు.
కాగా... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో త్రిశ్శూరు నుంచి సురేష్ గోపీ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సీపీఐ నేత వీఎస్ సునీల్ కుమార్ పై సుమారు 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తొలిసారి గెలవడంతో కెరళలో కాషాయపార్టీ ఖాతా తెరిచినట్లయ్యింది. దీంతో.. సురేష్ గోపీకి కేంద్రమంత్రి పదవి వరించింది. అయితే.. అది సినిమాల కంటే తక్కువే అంటున్నారు యాక్షన్ హీరో!