సూర్యకు జోడీగా 'సీతారామం' బ్యూటీ
'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్, 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ లతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారని తమిళ వర్గాలు పేర్కొన్నాయి.
By: Tupaki Desk | 22 Oct 2024 10:30 AM GMT'కంగువ' కోసం కాస్త ఎక్కువ సమయమే తీసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #Suriya45 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి.
'Suriya 45' అనేది భక్తిరసంతో కూడిన ఒక డివోషనల్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ గా రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలో భక్తిరస చిత్రాలకు ప్రేక్షకాదరణ లభిస్తోంది. పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు, దేవతలు.. కథాంశాలతో తెరకెక్కిన చిత్రాలు భాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. RJ బాలాజీ ఇంతకముందు తన స్వీయ దర్శకత్వంలో ‘అమ్మోరు తల్లి’ అనే డివోషనల్ ఫాంటసీ కామెడీ చిత్రాన్ని రూపొందించారు. ఈ క్రమంలో ఇప్పుడు సూర్యతో కలిసి భక్తి మార్గంలో ఓ ఫాంటసీ కథను చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో నటించే కథానాయికల గురించి కూడా కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో సూర్యకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని అంటున్నారు. 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్, 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ లతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారని తమిళ వర్గాలు పేర్కొన్నాయి. కశ్మీరా పర్దేశి కీలక పాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి 'కరుప్పు' 'హింట్' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించిన బాలాజీ.. నటుడుగా, గాయకుడుగా, దర్శకుడిగా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన ‘అమ్మోరు తల్లి’, ‘వీట్ల విశేషం’ సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో మూడో చిత్రానికే ఏకంగా స్టార్ హీరో సూర్యని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. 'Suriya 45' చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఆర్జే బాలాజీ దాదాపు ఏడాదికి పైగా సూర్య 45వ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేసినట్లుగా చిత్ర బృందం చెబుతోంది. 120 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. నవంబర్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025 సెకండాఫ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ప్రధాన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు. మరి కమెడియన్ తో కలిసి సూర్య చేయబోతున్న ఈ డివోషనల్ ఫాంటసీ ప్రయోగం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే సూర్య నటించిన 'కంగువ' సినిమా నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్ గా నటించింది. మరోవైపు కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సూర్య ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆడియన్స్ ముందుకు రానుంది.