Begin typing your search above and press return to search.

దత్తపుత్రుడు అనే ట్యాగ్ ను నిలబెట్టుకుంటాడా?

వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన సూర్య.. డబ్బింగ్ చిత్రాలతోనే తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 5:58 AM GMT
దత్తపుత్రుడు అనే ట్యాగ్ ను నిలబెట్టుకుంటాడా?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన సూర్య.. డబ్బింగ్ చిత్రాలతోనే తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే ఆయన్ను 'టాలీవుడ్ దత్తపుత్రుడు' అని పిలుస్తుంటారు. అయితే సూర్య నుంచి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చి చాలా ఏళ్లు అయింది. ఆయన నటించిన సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించడంలేదు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న 'కంగువ' మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

'గజినీ' మూవీతో తెలుగులో స్టార్ డమ్ అందుకున్న సూర్య.. సినిమా సినిమాకీ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఎన్నో విజయాలు సాధించాయి. అయితే 24, సింగం-3 తర్వాత వచ్చిన సూర్య సినిమాలు తెలుగులో పెద్దగా ఆడలేదు. గ్యాంగ్, NGK, బందోబస్త్ వంటి చిత్రాలు థియేటర్లలో ఫ్లాప్ అయ్యాయి. కోవిడ్ కారణంగా దురదృష్టవశాత్తూ 'ఆకాశం నీ హద్దురా' 'జై భీమ్' వంటి చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ కు నోచుకోలేదు. డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబడిన ఈ రెండు మూవీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కానీ ఆ తర్వాత వచ్చిన 'ఈటీ' సినిమా పాన్ ఇండియా వైడ్ గా పరాజయం చవిచూసింది. దీంతో ఈసారి సూర్య థియేటర్లలో తన స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన కెరీర్ కు 'కంగువ' కీలకంగా మారింది. ఇది సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీ. పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. దీని కోసం అతను రెండున్నరేళ్లపాటు కష్టపడ్డారు. ఇప్పటికే అనేక ఛాలెంజింగ్ పాత్రలను పోషించిన విలక్షణ నటుడు.. ఈసారి యోధుడి పాత్రలో నటించారు. ద్విపాత్రాభినయంతో అలరించడానికి రెడీ అయ్యారు.

కంగువ చిత్రానికి మాస్ డైరక్టర్ శివ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ భామ దిశా పటాని హీరోయిన్ గా నటించగా.. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించాయి. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో, 3డీ & ఐమాక్స్ ఫార్మాట్ లలో.. నవంబరు 14న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సూర్య సినిమాని తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. సూర్య సైతం తన కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ అవుతుందని నమ్ముతున్నారు. ఇలాంటి సినిమాలకు ఎలాంటి లిమిట్ ఉండదని అంటున్నారు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమా కావడంతో, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులోనూ ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టి, టాలీవుడ్ దత్యపుత్రుడు అనే పేరుని సార్థకం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.