Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో పండగకి రానట్లేనా..!

తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య నటించిన 'కంగువా' సినిమా కోసం ఫ్యాన్స్‌ గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Sep 2024 6:59 AM GMT
స్టార్‌ హీరో పండగకి రానట్లేనా..!
X

తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య నటించిన 'కంగువా' సినిమా కోసం ఫ్యాన్స్‌ గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి స్థాయి సినిమా అంటూ తమిళ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి. కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా ప్రేక్షకులు అంతా కంగువా కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల చేయాలని భావించారు. కానీ అనుకున్న సమయంకు సినిమాను విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వచ్చిన కంగువా మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కంగువా సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ, అదే సమయంలో రజినీకాంత్‌ హీరోగా జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన వేట్టయన్‌ సినిమా విడుదల అవ్వబోతుంది. అక్టోబర్‌ 10న సినిమా విడుదల కాబోతున్న వేట్టయన్ కి పోటీగా కంగువా వస్తే కచ్చితంగా రెండు సినిమాలకు నష్టం. ఎక్కువ బడ్జెట్‌ తో రూపొందిన కంగువా ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా రెండు సినిమాలను అదే తేదీన విడుదల చేయాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ బయ్యర్ల విజ్ఞప్తి మేరకు కంగువా ను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రెండు సినిమాలనూ కొందరు కామన్‌ బయ్యర్లు కొనుగోలు చేయడం జరిగిందట. దాంతో ఆయా ఏరియాలో విడుదల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా రజినీకాంత్‌ వంటి సీనియర్ హీరో కు సోలో రిలీజ్ ఇవ్వడం ద్వారా అయన్ను గౌరవించినట్లు అవుతుంది, ఆయన అభిమానులు సైతం కంగువాకు పాజిటివ్‌ గా ఉండే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయంతో సూర్య టీం రిలీజ్ ను వాయిదా వేసేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దసరా పండుగ మిస్‌ అవ్వడంతో దీపావళికి సినిమాను విడుదల చేయాలని మొదట భావించారు. కానీ దీపావళికి సోలో రిలీజ్ ఛాన్స్ లేదు కనుక నవంబర్‌ వరకు సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట.

విభిన్న చిత్రాలతో ఇప్పటి వరకు ఆకట్టుకున్న సూర్య మొదటి సారి అత్యంత భారీ బడ్జెట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రూ.300 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లు సంయుక్తంగా నిర్మించాయి. తెలుగు నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ మొదటి సారి తమిళ సినిమాను నిర్మించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా తెలుగులోనూ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి దిశా పటానీ హీరోయిన్‌ గా నటించగా కీలక పాత్రలో బాబీ డియోల్‌ నటించాడు. భారీ పీరియాడిక్‌ డ్రామాగా రూపొందిన కంగువా రూ.500 కోట్ల వసూళ్ల టార్గెట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ స్థాయి వసూళ్లు సాధించాంటే సినిమాకి సోలో రిలీజ్ అవసరం. అందుకే తొందరపడకుండా మెల్లగానే రావాలని మేకర్స్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.