Begin typing your search above and press return to search.

అనుకున్నట్లే అంతా.. కంగువ రిలీజ్ మరెప్పుడు?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ మూవీపై ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Sep 2024 6:09 AM GMT
అనుకున్నట్లే అంతా.. కంగువ రిలీజ్ మరెప్పుడు?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ మూవీపై ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోంది. సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. బీటౌన్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‍ తో రూపొందుతున్న ఆ సినిమాపై ట్రైలర్ తో ఒక్కసారిగా భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్.

అయితే ట్రైలర్ తోనే రిలీజ్ డేట్ ను కంగువ మేకర్స్ ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. కానీ కంగువ విడుదల వాయిదా పడినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అవే నిజమయ్యాయి. తన సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు స్వయంగా సూర్యనే తాజాగా అనౌన్స్ చేశారు.

మరో కోలీవుడ్ హీరో, తన తమ్ముడు కార్తీ Meiyazhagan మూవీ ఆడియో లాంఛ్ లో కంగువ రిలీజ్ విషయంపై క్లారిటీ ఇచ్చారు సూర్య. తమిళ చిత్రసీమలో రజనీ కాంత్ ఎంతో ప్రముఖమైన వ్యక్తి అని తెలిపారు. ఆయన నటించిన వెట్టియాన్, కంగువ చిత్రాలను ఒకే రోజు విడుదల చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. రజనీపై ఉన్న గౌరవంతో తన సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రజినీకాంత్ వెట్టియాన్.. అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

"నేను పుట్టినప్పటి నుంచి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సార్‌ నటిస్తూనే ఉన్నారు. 50 ఏళ్లుగా తమిళ చిత్రసీమకు ఆయన ఒక గుర్తింపు. కంగువ వెట్టియాన్ తో పోటీ పడడం సరికాదు. సోలోగా ఆయన సినిమా రావాలి. అందుకే నా చిత్రాన్ని వాయిదా వేస్తున్నా. అదే సమయంలో కంగువ మనందరికీ ప్రత్యేకమైన మూవీ. రెండున్నరేళ్లుగా చాలా కష్టపడ్డాం. అయితే కంగువ చిత్రాన్ని ఎప్పుడు థియేటర్లలోకి తీసుకురావాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు" అని సూర్య తెలిపారు.

ఇక కంగువ సినిమా విషయానికొస్తే.. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అండ్ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు. నటరాజన్ సుబ్రమణియం, జగపతి బాబు, యోగిబాబు, రెడిన్ కింగ్ స్లే, కోవై సరళ, వెన్నెల కిశోర్, మన్సూర్ అలీ ఖాన్, రియాజ్ ఖాన్, ఆనంద్ రాజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నైజాంలో ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ గ్రాండ్ గా విడుదల చేయనుంది.