టాలీవుడ్ లో గేర్ మార్చిన సూర్య!
ఈ నేపథ్యంలో తాజాగా సూర్య తెలుగు మార్కెట్ పై మరింత శ్రద్ద పెట్టినట్లు కనిపిస్తుంది.
By: Tupaki Desk | 11 Feb 2025 6:57 AM GMTకోలీవుడ్ స్టార్ సూర్యకు సరైన కమర్శియల్ హిట్ చాలా కాలమవుతోంది. సూర్య కమర్శియల్ సినిమాలు చేస్తున్నా? అంచనాలు మాత్రం అందుకోవడం లేదు. దీంతో పాన్ ఇండియాలో సంచలన మవుదామని `కంగువా` చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇది మొదటికే ముప్పు తెచ్చే లా ఉందని భావించి మళ్లీ తన కమర్శియల్ ట్రాక్ లోకి వచ్చేసాడు. కొంత కాలం పాటు మళ్లీ ఎలాంటి ప్రయోగాలు చేయనని వాణిజ్య అంశాలున్న సినిమాలే చేస్తానని అభిమానులకు ప్రామిస్ చేసాడు.
ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో `రెట్రో`లో నటిస్తున్నాడు. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాటు. `రెట్రో` ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాపై సూర్య చాలా కాన్పిడెంట్ గానూ ఉన్నాడు. తెలుగు, తమిళ్ లో మంచి విజయం సాధిస్తుందని సూర్య ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సూర్య తెలుగు మార్కెట్ పై మరింత శ్రద్ద పెట్టినట్లు కనిపిస్తుంది.
`రెట్రో` తెలుగు వెర్షన్ తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెబుతున్నాడట. ఇంత వరకూ సూర్య బ్రదర్స్ సినిమాకి తప్ప వేరే సినిమా కి తెలుగు లో డబ్బింగ్ చెప్పింది లేదు. భాషపై పట్టు లేకపోవడం సహా తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి పరిస్థితులు కారణంగా డబ్బింగ్ కి దూరంగా ఉన్నాడు. దీంతో ఆయన చాలా కాలంగా డబ్బింగ్ ఆర్టిస్టులపైనే ఆధార పడుతున్నాడు. అయితే వరుస వైఫల్యాలు, ఇతరులపై ఆధార పడటం వంటి సన్నివేశాలు సూర్య తెలుగు మార్కెట్ పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి.
వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తాజాగా సూర్య తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ కుదిరితే గనుక తదుపరి చిత్రం సహా ఇకపై అన్ని చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. సూర్య బ్రదర్ కార్తీ తెలుగు ఎంతో చక్కగా మాట్లాడుతాడు. అతడు తెలుగు మాట్లాడుతుంటే? తమిళ నటుడు కాదు తెలుగు నటుడే అనిపిస్తుంది. అంత స్వచ్ఛమైన తెలుగు కార్తీ మాట్లాడుతాడు. చాలా కాలంగా తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే.