ఆ స్టార్ హీరో కొన్నాళ్లిక వాటికి దూరంగా!
సూర్య నటించిన `కంగువ` భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమా ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే.
By: Tupaki Desk | 24 Nov 2024 3:15 AM GMTసూర్య నటించిన `కంగువ` భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమా ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. సూర్య కెరీర్ లో మరో ప్రయోగాత్మక చిత్రమిది. కానీ ఫలితమే బెడిసి కొట్టింది. ప్రయత్నం మంచిదే అయినా ప్రేక్షకుల్లో ఎగ్జైట్ మెంట్ తీసుకు రావడంలో విఫలమైంది. దీంతో `సెవెన్త్ సెన్స్` తర్వాత మరో ప్రయోగం బెడిసి కొట్టినట్లు అయింది. సూర్య కెరీర్ లో పాత్రలతో ప్రయోగాలు కొత్తేం కాదు.
కానీ భారీ స్పాన్ తో ప్రయోగాలు చేసిన ప్రతీసారి మాత్రం ఫలితాలు ఆశించిన విధంగా రావడం లేదు. `గజినీ` తర్వాత మురగదాస్ భారీ అంచనాల మధ్య `సెవెన్త్ సెన్స్` తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బడ్జెట్ 80-90 కోట్లు పెట్టారు. కానీ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లతో ముగించింది. నష్టాలు లేకుండా బయట పడింది తప్ప! సెవెన్త్ సెన్స్ సాధించిందేం లేదు. ఆ తర్వాత చాలా కాలం పాటు కమర్శియల్ సినిమాలే చేసాడు సూర్య.
వాటిలో కొన్ని సినిమా హిట్ అయ్యాయి. మరికొన్ని ఫెయిలయ్యాయి. కమర్శియల్ సినిమాలు పోయినా? అవి పెద్దగా లెక్కలోకి రావు. ప్రయోగాలు ఫెయిలైనప్పుడు బాధ పడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. `కంగువ` సినిమా కోసం సూర్య ఎంతగానో కష్టపడ్డారు. ప్రాజెక్ట్ మొదలైన నాటి నుంచి ముగించే వరకూ ఎంతో కష్టపడ్డారు. ఆ కథను తయారు చేయడం కోసం దర్శకుడు శివ అంతే హార్డ్ వర్క్ చేసారు. పేపరుపై రాసినంత ఈజీగా తీయడం సాధ్యం కాదని..అందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటుందని ప్రచారం సమయంలో అభిప్రాయ పడ్డారు.
ఇక సూర్య లుక్ కోసం ఎంతగా ఎఫెర్ట్ పెడతాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. కంగువలో ఆ లుక్ కోసం...మ్యాకప్ వేసుకుని షూటింగ్ చేయడం ఎంతో సవాల్ గా మారింది. సూర్య కెరీర్ లో ఎక్కువగా ఎఫెర్ట్ తో పాటు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ ఇదే. కానీ ఫలితం నిరాశను మిగల్చడంతో సూర్య కొన్నాళ్ల పాటు ప్రయోగాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని కోలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది. పాన్ ఇండియా కంటెంట్ కి దూరంగా ఉండి కమర్శియల్ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారుట. ఈసారి పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేస్తే అది రికార్డులు తిరగరాసే కంటెంట్ అయి ఉండాలని స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నారుట.