Begin typing your search above and press return to search.

స్టార్ హీరో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిస్తాడా?

టాలీవుడ్ లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న కొద్ది మంది తమిళ హీరోలలో సూర్య ఒకరు

By:  Tupaki Desk   |   24 July 2024 5:30 PM GMT
స్టార్ హీరో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిస్తాడా?
X

టాలీవుడ్ లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న కొద్ది మంది తమిళ హీరోలలో సూర్య ఒకరు. 'శివ పుత్రుడు', 'సుందరాంగుడు' వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సూర్య.. ‘గజిని’ సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయారు. అప్పటి నుంచీ తాను నటించే సినిమాలన్నిటినీ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా సూర్య సరైన థియేట్రికల్ సక్సెస్ సాధించలేకపోతున్నారు. ఓటీటీలో సత్తా చాటుతున్నారు కానీ, థియేట్రికల్ కు వచ్చే సరికి ఫెయిల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్ర హీరో 'కంగువ' మూవీతో పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు.

2019లో సూర్య నటించిన NGK, బందోబస్త్ చిత్రాలు తెలుగు ఆడియెన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఆ తర్వాత డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన 'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ థియేటర్లలో విడుదలైన 'ఈటీ' మూవీ మాత్రం డిజార్డర్ ఫలితాన్ని అందుకుంది. అతిథి పాత్రలు పోషించిన రెండు సినిమాలు హిట్టయ్యాయి కానీ, అవి సూర్య ఖాతాలోకి రావు. అందుకే ఇప్పుడు 'కంగువ'తో తన థియేట్రికల్ స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరం ఏర్పడింది.

కోలీవుడ్ మాస్ డైరక్టర్ శివ దర్శకత్వంలో 'కంగువ' సినిమా తెరకెక్కుతోంది. ఇదొక పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ మూవీ. ఇందులో సూర్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సూర్య లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. లేటెస్టుగా విడుదలైన ఫైర్ సాంగ్ కూడా అలరిస్తోంది. సినిమాలో విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నాయనే క్లారిటీ వచ్చేసింది. ఈ అంశాలన్నీ మూవీపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

'కంగువ' సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై హై టెక్నికల్ వాల్యూస్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా స్పెషల్ గా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో 3డీ ఫార్మాట్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు మొదలుపెట్టారు. ఇది 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

'కంగువ'తో పాటుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు సూర్య. ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా. Suriya44 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ హీరో బర్త్ డే సందర్భంగా రిలీజైంది. దీనికి ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ రెండు భారీ చిత్రాలతో రాబోతున్నారు సూర్య. వీటితో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.