సూర్య-కార్తి బ్రదర్స్ మౌనం వెనక
ఈ వివాదంలో కార్తీ-సూర్య సోదరుల పేర్లు హైలైట్ అవ్వడం ఇంకా పెద్ద షాకిస్తోంది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నిర్మాత జ్ఞానవేల్ రాజాతో దర్శకుడు అమీర్ కి పొసగలేదు.
By: Tupaki Desk | 27 Nov 2023 4:29 AM GMTదాదాపు 16 ఏళ్ల క్రితం విడుదలైన కల్ట్ క్లాసిక్ 'పరుత్తివీరన్' వివాదం ఇప్పుడు మరోసారి వెలుగులోకి రావడం ఆశ్చర్యపరిచింది. ఈ వివాదంలో కార్తీ-సూర్య సోదరుల పేర్లు హైలైట్ అవ్వడం ఇంకా పెద్ద షాకిస్తోంది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నిర్మాత జ్ఞానవేల్ రాజాతో దర్శకుడు అమీర్ కి పొసగలేదు. జ్ఞానవేల్ అతడికి సరిగా సహకరించలేదని ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సముదిరకని ఇంతకుముందే ప్రకటించారు. అమీర్‌కి బాసటగా నిలుస్తూ ఈ ప్రాజెక్టులో భాగం అయిన నటుడు కం ఫిలింమేకర్ శిశికుమార్ కూడా మాట్లాడారు. జ్ఞానవేల్ సహాయనిరాకరణతో అమీర్ అప్పులు చేసి పెట్టుబడులు సమకూర్చారని, పరుత్తివీరన్ విడుదల కోసం చాలామంది పెట్టుబడుల సాయం చేసారని సముదిరకని అన్నారు.
అయితే ఈ వివాదం విషయంలో సూర్య కానీ, కార్తీ కానీ ఎలాంటి స్పందనా లేకుండా మౌనం వహించడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కార్తీ నటించిన 'జపాన్' ప్రీరిలీజ్ అనంతరం పార్టీకి కార్తీ కోసం పని చేసిన దర్శకులందరినీ పిలిచి, అతడిని తెరకు పరిచయం చేసిన, జాతీయ అవార్డ్ సినిమాని ఇచ్చిన దర్శకుడు అమీర్ ని వదిలేయడంపైనా వేలెత్తి చూపిస్తున్నారు. ఒకవేళ వివాదాలు ఉన్నా ఇలాంటి సమయంలో సమసిపోవాలని, అలా కాకుండా కార్తీ ఎందుకు మౌనం వహించాడని కూడా ప్రశ్నిస్తున్నారు.
బ్రదర్స్‌తో జ్ఞానవేల్ రిలేషన్?
కార్తీ- సూర్య బ్రదర్స్ కి జ్ఞానవేల్ రాజా దగ్గర బంధువు అన్న ప్రచారం కూడా ఉంది. జ్ఞానవేల్ రాజా నటుడు శివకుమార్ కుటుంబానికి చాలా దూరపు బంధువు. అయినప్పటికీ తరచూ మీడియా ద్వారా శివకుమార్ కుమారులు సూర్య -కార్తీలకు దగ్గర బంధువు అని ప్రచారం సాగింది.
స్టూడియో గ్రీన్‌ని స్థాపించిన తర్వాత, అతను సూర్య ప్రధాన పాత్రలో నటించిన సిల్లును ఒరు కాదల్ (2006)ని నిర్మించడం ద్వారా సినీ నిర్మాణంలోకి ప్రవేశించాడు. ఆపై 2012 వరకు చాలా చిత్రాలకు నిర్మాత లేదా పంపిణీదారుగా సూర్య సోదరుడు కార్తీతో కలిసి జ్ఞానవేల్ పనిచేశాడు. పరుత్తివీరన్ (2007), సింగం (2010), నాన్ మహాన్ అల్లా (2010) సహా స్టూడియో గ్రీన్ చిత్రాలు లాభదాయక వ్యాపారం కొనసాగింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో డబ్బింగ్ చిత్రాల విడుదలల బాధ్యత కూడా జ్ఞానవేల్ తీసుకున్నారు. వాటి ద్వారా సూర్యకు చక్కని మార్కెట్ ఏర్పడింది. అట్టకత్తి (2012) తో సూర్య కాకుండా మరొక నటుడి చిత్రాలకు పంపిణీదారుడిగా జ్ఞానవేల్ మొదటి విజయం సాధించాడు. ఆ తర్వాత కుమ్కి (2012), సూదు కవ్వుం (2013) పంపిణీ తోను మరింత విజయాన్ని అందుకున్నాడు. కానీ సూర్య- కార్తీలతో అతడు కలిసి పని చేయడం వల్ల వారికి దగ్గర బంధువు అంటూ మీడియా ప్రచారం సాగించింది. అయితే ఇద్దరు బ్రదర్స్ తో జ్ఞానవేల్ ఎంతో సన్నిహితంగా ఉంటారు. వారితో కలిసి వ్యాపారంలో ఉన్నారు.
జ్ఞానవేల్ రాజా తన చిన్నతనం నుండి సినీ నిర్మాతగా మారాలనే ఆసక్తిని పెంచుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన పాఠశాల రోజుల నుండి చెన్నైలోని సెయింట్ బెడెస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లోని తరగతులను క్రమం తప్పకుండా మానేసి, సమీపంలోని దేవి లేదా సత్యం సినిమా హాళ్లలో సినిమాలు చూసేవాడిని అని కూడా వెల్లడించాడు.