Begin typing your search above and press return to search.

సుశాంత్ సింగ్ డెత్ కేసు.. ప్రియురాలిపై CBI రిపోర్ట్!

సుశాంత్ రాజ్‌పుత్ తండ్రి అత‌డి ప్రేయ‌సి, నటి రియా చక్రవర్తిపై అనుమానం వ్య‌క్తం చేస్తూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు.

By:  Tupaki Desk   |   23 March 2025 11:32 AM IST
సుశాంత్ సింగ్ డెత్ కేసు.. ప్రియురాలిపై CBI రిపోర్ట్!
X

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మిస్టీరియ‌స్ డెత్ విచార‌ణ క‌న్ క్లూజ‌న్‌కి రాబోతోందా? అంటే అవున‌నే తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి. 34 ఏళ్ల సుశాంత్ సింగ్ 14 జూన్ 2020న తన ముంబై బాంద్రా అపార్ట్‌మెంట్‌లో చనిపోయి కనిపించాడు. అతడి మరణం వెన‌క ప్రియురాలి కుట్ర దాగి ఉంద‌ని కుటుంబీకులు వాదించారు. అనంత‌రం ప‌లు ఏజెన్సీలు దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టాయి. కానీ ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ఈ విచార‌ణ‌లో నిజానిజాలు ఇంకా నిగ్గు తేలలేదు.

సుశాంత్ రాజ్‌పుత్ తండ్రి అత‌డి ప్రేయ‌సి, నటి రియా చక్రవర్తిపై అనుమానం వ్య‌క్తం చేస్తూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. ఈ కేసులో సీబీఐ ఆగస్టు 2020లో బీహార్ పోలీసుల నుండి దర్యాప్తును టేకోవ‌రో చేసింది. నాలుగు సంవత్సరాలకు పైగా విచారణ తర్వాత సుశాంత్ రాజ్‌పుత్ మరణానికి రియా చ‌క్ర‌వ‌ర్తి కారణమని దర్యాప్తు ఏజెన్సీకి ఎటువంటి ఆధారాలు లభించలేదని తాజాగా క‌థ‌నాలొస్తున్నాయి. రియా చక్రవర్తి, ఆమె కుటుంబంపై ఎటువంటి తప్పు క‌నుగొన‌లేద‌ని సీబీఐ ప్ర‌క‌టించిన‌ట్టు జాతీయ మీడియా వెల్ల‌డించింది.

పింక్ విల్లా క‌థ‌నం ప్ర‌కారం..ఈ కేసులో రెండు ఎఫ్‌ఐఆర్‌లలో రియా చక్రవర్తి, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు సహా అందరినీ సిబిఐ నిర్దోషులుగా ప్రకటించింది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుండి ఫోరెన్సిక్ బృందం కూడా సుశాంత్ రాజ్‌పుత్ మరణం హత్య కాదని, ఆత్మహత్య కేసు అని తేల్చింది.

సుశాంత్ రాజ్‌పుత్ మరణం తరువాత బీహార్ పోలీసులు పాట్నాలో అతని తండ్రి కెకె సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆత్మహత్యకు ప్రేరేపించారనే కేసును నమోదు చేశారు. రియా చక్రవర్తి అత‌డిని మానసికంగా హింసించంద‌ని, డ్ర‌గ్స్ ఇచ్చి అత‌డిని ఆర్థికంగా దోపిడీ చేసింద‌ని.. చివ‌ర‌కు అత‌డి మ‌ర‌ణానికి కార‌ణ‌మైందని సుశాంత్ సింగ్ కుటుంబం ఆరోపించింది. దర్యాప్తును సీబీఐ తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు, నేరస్థలాన్ని ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సి.ఎఫ్‌.ఎస్‌.ఎల్‌)కి ఆదేశాలు అందాయి. ఒక ల్యాప్‌టాప్, హార్డ్ డ్రైవ్‌లు, ఒక కానన్ కెమెరా, రెండు మొబైల్ ఫోన్‌లను సేక‌రించి వాటిని ద‌ర్యాప్తు అధికారులు క్షుణ్ణంగా విశ్లేషించారు. ఈ ద‌ర్యాప్తులో రియా చ‌క్ర‌వ‌ర్తి స‌హా 20 మందికి పైగా వ్యక్తులను ప్ర‌శ్నించారు.

సీబీఐ తాజాగా కేసు క్లోజింగ్ నివేదిక‌ను సమర్పించిన తర్వాత బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఇక ఈ కేసును అధికారికంగా మూసివేసే అవ‌కాశం ఉంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. ఈ కేసులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేసినందుకు రియా చక్రవర్తి న్యాయవాది సతీష్ మనేషిండే ఒక ప్రకటనలో సీబీఐకి కృతజ్ఞతలు తెలిపారు. రియా చ‌క్ర‌వ‌ర్తిపై త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను సిద్ధాంతాల‌ను లాయ‌ర్ తీవ్రంగా ఖండించారు. అమాయ‌కుల‌ను వెంటాడి వేధించార‌ని, ఇలాంటివి ఎప్పుడూ జ‌ర‌గ‌కూడ‌ద‌ని రియా చ‌క్ర‌వ‌ర్తి లాయ‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. రియాను బెయిల్‌పై విడుదల చేసే వరకు, చేయని తప్పున‌కు 27 రోజులు జైలులో ఉంచారని కూడా ఆయ‌న విమ‌ర్శించారు.