Begin typing your search above and press return to search.

సెట్ కెళ్లిన త‌ర్వాత షాక్ తిన్న సీనియ‌ర్ బ్యూటీ!

కానీ సుస్మితా సేన్ మాత్రంఓ సినిమా విష‌యంలో హీరో ఎవ‌రో తెలియ కుండానే సైన్ చేసిందిట‌.

By:  Tupaki Desk   |   7 Oct 2024 10:30 AM GMT
సెట్ కెళ్లిన త‌ర్వాత షాక్ తిన్న సీనియ‌ర్  బ్యూటీ!
X

హీరోయిన్ ఏ సినిమా క‌థ విన్నా? ముందుగా అందులో హీరో ఎవ‌రు? అని అడిగి తెలుసుకుంటారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌క‌, ర‌చ‌యితుల చెప్పే క‌థ‌లు వింటారు. క‌థ పాత్ర న‌చ్చితే ఒకే చెబుతారు. అటుపై ముందుకెళ్తారు. కానీ హీరో ఎవ‌రో తెలియ‌కుండా ఏ న‌టి సినిమాకి సైన్ చేయ‌దు. ఎందుకంటే? అక్క‌డ బోలెడ‌న్ని అంశాలు ఆధార‌ప‌డి ఉంటాయి. కానీ సుస్మితా సేన్ మాత్రంఓ సినిమా విష‌యంలో హీరో ఎవ‌రో తెలియ కుండానే సైన్ చేసిందిట‌.


సెట్ కి వెళ్లిన త‌ర్వాత ఆ హీరోని చూసి షాక్ అయిందిట‌. అదేంటో తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. షారుక్ ఖాన్, సుస్మితాసేన్ జంట‌గా న‌టించిన `మైహూనా` చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ద‌ర్శ‌కురాలిగా ఫరాఖాన్ కిది తొలి చిత్రం. ఇందులో చాందిని పాత్ర‌లో సుస్మితా సేన్ కుర్ర కారుని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే? ఈ సినిమా సెట్ కి వెళ్లే వ‌ర‌కూ గానీ అందులో హీరో షారుక్ ఖాన్ అన్న విష‌యం తెలియ‌ద‌ని తాజాగా రివీల్ చేసింది సుస్మితా సేన్.

`సిర్ప్ తుమ్ లో దిల్బ‌ర్ దిల్బ‌ర్` అనే పాట చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు ఫ‌రా త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మొద‌టి సినిమాలో న‌టిస్తారా? అని అడిగింది. క‌చ్చితంగా న‌టిస్తాన‌ని మాట ఇచ్చాను. కొన్నేళ్ల‌కు ఆమె త‌న తొలి చిత్రం క‌థ‌తో సంప్ర‌దించింది. సినిమా క‌థేంటి? తొలి సినిమా హీరో ఎవ‌రు? అనే వివ‌రాలు కూడా అడ‌గ‌కుండా ఇచ్చిన మాట కోసం ప్రాజెక్ట్ కి అంగీక‌రించాను.

ఓ రోజు షూటింగ్ కి ర‌మ్మ‌ని ఫిలింసిటీకి పిలిపించారు ఫ‌రాఖాన్. స్పాట్కి వెళ్లి చూసే స‌రికి అక్కడ షారుక్ ఖాన్ ఉన్నారు. దీంతో నేను షాక్ అయ్యాను. ఇది నా జీవితంలో జ‌రిగిన అద్భుత‌మైన విష‌యం. మైహూనా లో షారుక్ ఖాన్కి హీరోయిన్ అవుతాన‌ని ఎప్పుడూ ఊహించ‌లేదు. కానీ అనుకోకుండా ఆయ‌న‌తో న‌టించ‌డం న‌న్ను కెరీర్ లో మ‌రో మెట్టు ఎక్కించింది. ఇది నా జీవితానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. ఆ త‌ర్వాత నా ఇమేజ్ మారింది` అని అన్నారు.