ట్రాన్స్ జెండర్ సంఘానికి సుస్మితాసేన్ సిరీస్ అంకితం!
వాస్తవానికి ఇలాంటి బయోపిక్ లు చేయడం కూడా సుస్మితకు ఇదే తొలిసారి.
By: Tupaki Desk | 9 Aug 2023 6:39 AM GMTబాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'ఆర్య'తో పరిచయమైన అమ్మడు 'తాలి' అనే రెండవ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ట్రాన్స్ జెండర్ కార్యకర్త గౌరీ వాసంత్ జీవితం అధారంగా జాతీయ అవార్డు దర్శకుడు రవి జాదవ్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట లుక్ పోస్టర్ లో సుస్మితా సేన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ట్రాన్స్ జెండర్ ఆహార్యంలో సుస్మితా అచ్చంగా దిగిపోయింది. ఆ పోస్టర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
చాలా కాలం తర్వాత ఓ గొప్ప పాత్రలో సుస్మిత నటిస్తుందని..ఇలాంటి పాత్రలు సమాజంలో అవేర్ నెస్ తీసుకొస్తాయని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వాస్తవానికి ఇలాంటి బయోపిక్ లు చేయడం కూడా సుస్మితకు ఇదే తొలిసారి.
దీంతో ఆ అనుభవాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఈ ప్లాట్ ఫామ్ నన్ను నటిగా ఎదగడానికి అవకాశం కల్పించింది. 'తాలి'ని మొదలు పెట్టినప్పుడు ఓ ముఖ్యమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాను. గౌరీ వాసంత్ అద్భుతమైన వ్యక్తి.
తనలా చేయలేము. ఆమె జీవితాన్ని మొత్తం చూపించాం. ట్రాన్స్ జెండర్స్ ని మనుషులుగా గుర్తించాలి. ఈసిరీస్ ఆసంఘానికి అంకితమిస్తున్నాం. ప్రజలందరికీ నచ్చుతుంది. ప్రజల ఆలోచనల్లో మార్పులు రావాలి.
లింగబేధాల ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. దాన్ని అధిగమించడానికి మంచి బావాలు కలిగి ఉండాల్సిన సమయం ఇది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. ఎంతో మంది వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు.
సమాజంలో అందరికీ సరైన గౌరవం..గుర్తింపు దక్కడం లేదు. అలాంటి వారి కథల్ని తెరపైకి తీసుకురావాలి. సమాజంలో అందరికీ సముచిత స్థానం కల్పించాలి. నేను అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యులు సూచించే మాత్రలకన్నా నటనే నాకు గొప్ప ఔషదం గా భావించాను. ఇది చెప్పడానికి సులభంగా ఉండొచ్చు. కానీ ఓ ఆర్టిస్ట్ గా ప్రేమించిన వృత్తి పట్ల అంతే నిబద్దతో ఉండాలి' అని అన్నారు.