Begin typing your search above and press return to search.

నీతా అంబానీ ఈవెంట్లో రామ్ చ‌ర‌ణ్‌

అంబానీల‌ను, గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌ను విడ‌దీసి చూడ‌లేం. అంబానీలు ఎక్క‌డ ఉంటే అక్క‌డ గ్లామ‌ర్ తుల‌తూగుతుంది

By:  Tupaki Desk   |   9 Nov 2023 3:50 PM GMT
నీతా అంబానీ ఈవెంట్లో రామ్ చ‌ర‌ణ్‌
X

అంబానీల‌ను, గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌ను విడ‌దీసి చూడ‌లేం. అంబానీలు ఎక్క‌డ ఉంటే అక్క‌డ గ్లామ‌ర్ తుల‌తూగుతుంది. ముఖేష్ అంబానీ- నీతా అంబానీ జంట ఇటీవ‌ల త‌మ వ్యాపార సామ్రాజ్యాన్ని అంత‌టా విస్త‌రించే ప‌నిలో ఉన్నారు. గ‌త నెల‌లో నీతా అంబానీ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ని ముంబైలో ప్రారంభించగా దానికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఆ త‌ర్వాత ముంబైలోనే జియో వ‌ర‌ల్డ్ సెంట‌ర్ ని ప్రారంభించ‌గా దానికి గొప్ప పేరొచ్చింది. ప్ర‌తి ఈవెంట్లో బాలీవుడ్ సెల‌బ్రిటీల జిగిబిగి క‌ళ్లార్ప‌నివ్వ‌లేదు. ఇండ‌స్ట్రీ బెస్ట్ స్టార్లు అంబానీల ఈవెంట్లో ముఖ్య అతిథులుగా ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు. ఒక‌వేళ ముంబైలో ఈవెంట్ అయితే ఖాన్ ల‌తో పాటు, క‌పూర్ గాళ్స్, క‌త్రిన‌, జాన్వీ, సారా అలీఖాన్ లు వేడుక‌లో క్యాట్ వాక్ లు చేస్తున్నారు. అదే హైద‌రాబాద్ లో రిల‌య‌న్స్ కి సంబంధించిన ఏదైనా ప్రారంభోత్స‌వం జ‌రిగితే దానికి ఎవ‌రుంటారు? అన్న సందేహం మ‌న‌కు అస‌లే వ‌ద్దు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో కూడా అంబానీల‌కు భారీ సెల‌బ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్క‌డ అంద‌రూ సూపర్ స్టార్లు అంబానీల‌కు అభిమానులు. ఈ విష‌యం తాజాగా హైద‌రాబాద్ లో రిల‌య‌న్స్ రిటైల్ తొలి స్వదేశ్ స్టోర్ లాంచింగ్ లో బ‌య‌ట‌ప‌డింది. ఈవెంట్లో హైద‌రాబాద్ కి చెందిన సినీ క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు క‌నిపించారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న‌, న‌మ్ర‌త శిరోద్క‌ర్, మంచు ల‌క్ష్మి ఉన్నారు. క్రీడా రంగం త‌ర‌పున టెన్నిస్ స్టార్లు సానియా మీర్జా, సింధు వంటి వారు సంద‌డి చేసారు. వీళ్లంద‌రి రాక‌తో అంబానీల ఈవెంట్ క‌న్నుల‌పండుగ‌ను త‌ల‌పించింది. ఈ వేడుక‌లో నీతాజీ, ముఖేష్ అంబానీల‌ను చ‌ర‌ణ్ స‌హా న‌మ్ర‌త‌, సానియా త‌దిత‌రులు క‌లిసారు.

ఇంత‌కీ ఏమిటా ఘ‌న‌కార్యం?

హైదరాబాద్‌లో రిలయన్స్ రిటైల్ తొలి స్వదేశ్ స్టోర్‌ను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్‌పర్సన్ నీతా అంబానీ బుధవారం ప్రారంభించారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ ప్రాంతంలోని సంపన్న సబర్బన్ పరిసరాల్లో ఉన్న ఈ స్టోర్ 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. చాలా కాలంగా మరచిపోయిన పద్ధతులతో స్థానిక ప్ర‌తిభావంతులు రూపొందించే స్థానిక వస్తువులను మాత్ర‌మే ఇక్క‌డ విక్ర‌యిస్తారు. ప్రతిభావంతులైన భార‌తీయ‌ కళాకారులు పూర్తిగా చేతితో తయారు చేసిన ఉత్పత్తులను మాత్రమే అమ్ముతారు. భారతదేశంలోని వివిధ రకాల ఆహార ఉత్పత్తులు, దుస్తులు, హస్తకళలు, వస్త్రాల గురించి ఈ స్టోర్ లో తెలుసుకోవ‌చ్చు. వారు 'స్కాన్ అండ్ నో' ఫీచర్ ద్వారా ప్రతి ఉత్పత్తి త‌యారీ వెన‌క శ్ర‌మ‌ను తెలుసుకోగ‌ల‌రు. ప్రత్యేకమైన ఉత్పత్తులను రూపొందించడానికి స్వదేశ్‌తో సహకరించడానికి కస్టమర్‌లకు సహాయపడే ప్రత్యేక సేవ‌ల‌తో పాటు, స్టోర్‌లో ఆహార ప్రియుల కోసం ఫార్మ్-టు-టేబుల్ కేఫ్ కూడా ఉందని కంపెనీ తెలిపింది. స్వదేశ్ స్టోర్లు కళాకారులు,యు చేతివృత్తుల వారికి స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కూడా అందిస్తాయి. భారతదేశ పురాతన కళలు, హస్తకళలు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చాలని స్వదేశ్ లక్ష్యంగా పెట్టుకుంది అని రిల‌య‌న్స్ స్వదేశ్ ప్రకటన పేర్కొంది.

స్వదేశ్ స్టోర్‌తో క‌ళాకారుల‌కు ఉపాధి:

మొదటి స్వదేశ్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ, రిలయన్స్ రిటైల్ స్వదేశ్ ఆఫర్‌ను యుఎస్ -యూరప్ వంటి అంతర్జాతీయ మార్కెట్‌లలో విస్తరిస్తుందని, తద్వారా భారతీయ హస్తకళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ఆమె మాట్లాడుతూ, ''స్వదేశ్ మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని హైలైట్ చేస్తుంది మన నైపుణ్యం కలిగిన కళాకారులకు గౌరవం పెంచి జీవనోపాధిని అందిస్తుంది. వారు నిజంగా మన దేశానికి గర్వకారణం. స్వదేశ్ ద్వారా వారికి గొప్పగా అర్హమైన ప్రపంచ గుర్తింపును అందించాలని మేము ఆశిస్తున్నాము. అందుకే మేము స్వదేశ్‌ను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా విస్త‌రిస్తున్నాం. US - యూరప్‌లో కూడా విస్త‌రిస్తున్నాము'' అని తెలిపారు. మొదటి స్వతంత్ర స్వదేశ్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా నీతా అంబానీని మాజీ టెన్నిస్ డబుల్స్ ప్రపంచ నంబర్ 1 సానియా మీర్జా, ఒలింపిక్స్ ఛాంపియన్ PV సింధు, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య , నటి నమ్రతా శిరోద్కర్ క‌లిసారు.