Begin typing your search above and press return to search.

కల్కి.. రికార్డుల కోసం కాదు!

స్వప్న దత్ మాట్లాడుతూ, "మా చిత్రం రికార్డులు దాటిందా అని అడుగుతున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు.

By:  Tupaki Desk   |   28 Jun 2024 9:35 AM GMT
కల్కి.. రికార్డుల కోసం కాదు!
X

మొత్తానికి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న "కల్కి 2898AD" సినిమాపై ప్రేక్షకుల స్పందనతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. చాలా రోజుల అనంతరం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక ప్రత్యేకమైన సందడి కనిపిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సినిమా కోసమే అందరం ఎదురు చూస్తున్నాము అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమా రికార్డులపై చాలా రకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలుస్తోంది అని అంటున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా కల్కి గట్టిగానే సౌండ్ చేస్తోంది. నార్త్ లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇక ఈ సినిమా సాధించిన వసూళ్లపై నిర్మాతల్లో ఒకరైన స్వప్న దత్ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ప్రేక్షకుల అభిమానం, బాక్సాఫీస్ రికార్డులపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

స్వప్న దత్ మాట్లాడుతూ, "మా చిత్రం రికార్డులు దాటిందా అని అడుగుతున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది నిజంగా హాస్యాస్పదం, ఎందుకంటే రికార్డులు సృష్టించేవారు ఎప్పుడూ రికార్డుల కోసం సినిమాలు తీయరు. మేము ప్రేక్షకుల కోసం, సినిమా ప్రేమ కోసం చిత్రాలను నిర్మిస్తాం. "కల్కి 2898AD" కుడా అదే విధంగా రూపొందించాం" అని ఆమె తెలిపారు.

దీన్ని బట్టి మేకర్స్ సినిమా కలెక్షన్లపై రికార్డ్స్ పై ఎంత క్లారిటిగా ఉన్నారో అర్ధమవుతుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖ నటులు ఉన్నారు. "కల్కి 2898AD" చిత్రానికి భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ కథనం అనే అంశాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఇదే కారణంగా మొదటి రోజే సినిమా రికార్డులు బద్దలు కొట్టింది.

సినిమా విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల విషయంపై ప్రేక్షకులు, ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఉన్నారు. కానీ స్వప్న దత్ మాత్రం రికార్డులు సృష్టించడం కంటే సినిమా ప్రణాళికను అందరికీ చేరవేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పడం విశేషం. ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగించడమే తమ ధ్యేయమని స్వప్న దత్ ఒక్క మాటలో తేల్చేసిన విధానంకు పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి.

"కల్కి 2898AD" సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించింది. యాక్షన్ సీక్వెన్సులు, విజువల్స్, కథనం అన్ని కలిపి సినిమా విజయవంతం కావడానికి కీలకమయ్యాయి. ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చినందుకు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక, "కల్కి 2898AD" సినిమా వీకెండ్ అనంతరం కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.