ఛావా : క్షమించండి, నా ఉద్దేశం అది కాదు.. హీరోయిన్ వివరణ
ఛావా సినిమా ఒకవైపు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకు పోతున్న సమయంలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ వివాదాస్పద ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 22 Feb 2025 6:39 AM GMTవిక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఛావా' సినిమాకు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ వీకెండ్ పూర్తి అయ్యేప్పటి వరకు ఛావా సినిమా రూ.500 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంద కోట్ల వసూళ్లు సాధించినా గొప్ప విషయమే అన్నట్లుగా బాలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాల పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఏకంగా రూ.500 కోట్లు అంతకు మించి వసూళ్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రను తెలుసుకునేందుకు, శివాజీ మహారాజ్ వారసుడి గురించి తెలుసుకోవడం కోసం జనాలు థియేటర్లకు వెళ్తున్నారు.
ఛావా సినిమా ఒకవైపు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకు పోతున్న సమయంలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ వివాదాస్పద ట్వీట్ చేశారు. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర అంటూ కల్పిత పాత్రను ఛావా సినిమాలో చూపించారు. 500 ఏళ్ల క్రితం హిందువులను హింసించినట్లు చూపించారు. ఆ కల్పిత కథను జనాలు నమ్ముతున్నారు. కానీ ఇటీవల జరిగిన కుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన హిందువుల గురించి ఏ ఒక్కరూ స్పందించడం లేదు. కళ్ల ముందు జరిగిన ఘటన కంటే కల్పిత కథకు ఎక్కువగా జనాలు ప్రాముఖ్యత ఇవ్వడం విడ్డూరంగా ఉంది అంటూ నటి స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దాంతో ఆమెను నెట్టింట ఓ రేంజ్‌లో విమర్శించడం మొదలు పెట్టారు.
స్వర భాస్కర్ తీరును హిందూ వ్యతిరేకి అంటూ విమర్శలు చేస్తున్నారు. తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం నేపథ్యంలో స్వర భాస్కర్ తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. హిందువులను అవమాన పరచడం తన ఉద్దేశం కాదు అంటూ చెప్పుకొచ్చింది. నా మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మన చరిత్రను ఎంతో గొప్పగా గౌరవిస్తాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే నాకు ఎంతో గౌరవం, ఆయన వైభవం తెలుసుకునేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటాను. కానీ కొందరు ఆయన వైభోగం తప్పుగా చూపించడం, దుర్వినియోగం చేయడం నాకు నచ్చడం లేదని స్వర భాస్కర్ చెప్పుకొచ్చింది.
చారిత్రాత్మక అవగాహన కల్పించినప్పుడు జనాలను ఏక తాటి పైకి తీసుకు వచ్చే విధంగా ఉండాలి. అంతే తప్ప ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే విధంగా ఉండకూడదు. ప్రజల దృష్టిని మరల్చడానికి కొందరు చూస్తున్నారు అంటూ స్వర భాస్కర్ విమర్శలు చేసింది. ఒక వేళ నా గత ట్వీట్ మీ మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉంటే చింతిస్తున్నాను. ఎవరిని కించ పరచడం, అవమాన పరచడం అనేది నా ఉద్దేశం కాదు. భారత దేశ చరిత్ర గురించి తెలుసుకుని గర్వించే వారిలో నేను ముందు ఉంటాను. నా దేశం పట్ల, నా వీరుల పట్ల గౌరవం ఉందని స్వర భాస్కర్ వివరణ ఇచ్చింది. స్వర భాస్కర్ తాజా ట్వీట్‌తో ఆమెపై విమర్శలు తగ్గే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి. ఛావా సినిమా గురించి ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నెట్టింట ఒక వర్గం తీవ్ర స్థాయిలో వారిపై దూకడం గత రెండు మూడు రోజులుగా కామన్‌గా జరుగుతోంది.