'భూత్ బంగ్లా' లో టబు.. అసలేం జరుగుతోంది?
భూత్ బంగ్లా కాస్టింగ్ రోజురోజుకు పెద్దదవుతుంటే అది మరింత ఉత్కంఠను పెంచుతోంది.
By: Tupaki Desk | 20 Dec 2024 2:30 AM GMTజాతీయ ఉత్తమ నటి టబు ఇటీవలే 'క్రూ' సినిమాలో కరీనా, కృతి సనోన్ తో పోటీపడి మరీ నటించింది. ఈ సినిమా తర్వాతా పలు క్రేజీ చిత్రాలకు టబు సంతకాలు చేసిందని సమాచారం. ఇదే వరుసలో ప్రియదర్శన్ - అక్షయ్ కుమార్ క్రేజీ కాంబినేషన్‌తో కలిసి 'భూత్ బంగ్లా' అనే చిత్రానికి సంతకం చేసిందని సమాచారం. ఇది హారర్ కామెడీ ఫ్రాంఛైజీ. ఇందులో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేయాలని ప్రియదర్శన్ బృందం ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఈ ఫ్రాంఛైజీతో ఏక్తా కపూర్ లాంటి బోల్డ్ మహిళా నిర్మాత చేరడం మరింత ఆసక్తిని పెంచుతోంది.
అక్షయ్ - ప్రియదర్శన్ 13 సంవత్సరాల తర్వాత ఒక హార్రర్ కామెడీ కోసం తిరిగి కలుస్తుండడం కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ కామెడీ చిత్రంలో పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ తదితరులు నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ సరసన యువకథానాయిక వామికా గబ్బి నటించనుంది.
2000లో హేరా ఫేరిలో చివరిగా కలిసి నటించిన తర్వాత టబు- అక్షయ్ కుమార్ ఇంత కాలానికి తిరిగి కలుస్తుండటం అభిమానుల్లోను ఉత్సాహం పెంచుతోంది. హారర్ కామెడీ స్క్రిప్టులో తన పాత్ర బాగా నచ్చడంతో టబు ఈ చిత్రానికి ఓకే చెప్పారట. ప్రియదర్శన్ సృష్టించబోయే క్రేజీ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి టబు చాలా ఉత్సాహంగా వేచి చూస్తోందని సమాచారం. భూత్ బంగ్లా కాస్టింగ్ రోజురోజుకు పెద్దదవుతుంటే అది మరింత ఉత్కంఠను పెంచుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 2025 నాటికి పూర్తి చేసి 2026 ఏప్రిల్ లో సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రం జానర్ కారణంగా భారీగా విజువల్ ఎఫెక్ట్స్ అవసరమని కూడా మేకర్స్ చెబుతున్నారు. హారర్ కామెడీ జానర్‌లో కొత్త సినిమాటిక్ అనుభూతిని సృష్టించడానికి ప్రియదర్శన్ తనవంతు ప్రయత్నిస్తున్నారు. ఏక్తా కపూర్, అక్షయ్ కుమార్ , ప్రియదర్శన్ భూత్ బంగ్లాను ఒక విభిన్నమైన హార్రర్ కామెడీ ఫ్రాంచైజీగా మార్చే ప్రణాళికలపై సీరియస్ గా చర్చిస్తున్నారని కూడా పింక్ విల్లా తన కథనంలో పేర్కొంది.భూత్ బంగ్లా ఫ్రాంచైజీని మునుముందు అక్షయ్ కుమార్‌తో మాత్రమే ముందుకు తీసుకెళతారని తెలుస్తోంది.