టబుకు తెలుసా? హైదరాబాద్ ఆకాశంలో ఏం మార్పు వచ్చిందో!
నగరంలో తన స్నేహితులు, బంధువులు ఉన్నారు. తెలుగు పరిశ్రమలో ప్రముఖులతోను తనకు సత్సంబంధాలున్నాయి.
By: Tupaki Desk | 4 Feb 2025 5:18 PM GMTఅక్షయ్ కుమార్ - ప్రియదర్శన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ హారర్ చిత్రం `భూత్ బంగ్లా` కాస్టింగ్ లో చేరిన టబు, తన పాత్ర చిత్రీకరణ ముగించాక, హైదరాబాద్‌లోని తన నివాసంలో అడుగుపెట్టారు. ఈ నగరం టబు పుట్టినిల్లు. ముంబై టు హైదరాబాద్ నిరంతరం షూటింగుల కోసం, కుటుంబ సభ్యుల కోసం ప్రయాణించడం టబుకు అలవాటు. నగరంలో తన స్నేహితులు, బంధువులు ఉన్నారు. తెలుగు పరిశ్రమలో ప్రముఖులతోను తనకు సత్సంబంధాలున్నాయి.
వీటన్నిటినీ మించి జాతీయ ఉత్తమ నటికి బాల్యంలో ఎన్నో చెరిగిపోని తీపి జ్ఞాపకాలు హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉన్నాయి. మేడపై నుంచి నింగిలోని చుక్కలను, అందమైన చందమామను చూస్తూ తీపి ఊహల్లోకి వెళ్లిపోయిన బాల్యాన్ని టబు ఎప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు హైదరాబాద్ కి కొంత గ్యాప్ తర్వాత చేరుకుంది కాబట్టి ఒకసారి తన బాల్యాన్ని టబు గుర్తు చేసుకుంది. అంతేకాదు.. తన చిన్నతనంలో హైదరాబాద్ ఆకాశం ఎలా ఉండేదో నాటి రోజుల్లోనే తన కెమెరాలో నిక్షిప్తం చేసిన ఎక్స్ క్లూజివ్ ఫోటోగ్రాఫ్ ని వెతికి మరీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.
ఈ ఫోటోగ్రాఫ్ లో కాలుష్యం అన్నదే లేని స్వచ్ఛమైన నీలి రంగు ఆకాశాన్ని చూపిస్తోంది. సూర్యాస్తమయం వేళ కనిపించే సూర్యుని ఎరుపు రంగు, అక్కడక్కడా ఆకాశం అంచుల్ని తాకుతున్న భారీ భవంతులు కూడా ఈ ఫోటోగ్రాఫ్ లో కనిపిస్తున్నాయి. ``హైదరాబాద్ ఆకాశంతో బాల్య సంబంధాలు`` అని టబు దీనికి క్యాప్షన్ ఇచ్చారు. టబు షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ చూడగానే, 90ల నాటి అందమైన ఆహ్లాదకరమైన హైదరాబాద్ ఓమారు అందరికీ గుర్తుకు వచ్చింది. ఆ వెంటనే నేటి కార్పొరెట్ జంగిల్‌లోని కాలుష్యం కూడా కళ్ల ముందే కనిపించింది. ఇప్పుడు నీలి ఆకాశంలో ఏ కాలుష్య కారకం దాగి ఉందో, ఎలాంటి విష వాయువులు చేరుకున్నాయో చెప్పలేని పరిస్థితి. హైదరాబాద్ పరిసరాల్లోని ఫార్మా కంపెనీలు సహా ఇండస్ట్రియల్ కారిడార్స్ నుంచి వెలువడే విఫపూరిత రసాయనాలు, నగరంలో తిరిగే వాహన కాలుష్యం, భారీ నిర్మాణాలతో పోగయ్యే దుమ్ము పొగ వగైరా ఇప్పుడు ఆకాశం రంగుతో పాటు, అక్కడ కూల్ వాతావరణాన్ని కూడా నాశనం చేసాయి. అయితే మారిన ఈ పర్యవసానం గురించి టబుకు తెలుసో లేదో? అంటూ అభిమానులు సందేహిస్తున్నారు.
అక్షయ్ కుమార్, టబు చాలా ఏళ్ల తర్వాత ప్రియదర్శన్ తో కలిసి పని చేస్తున్నారు. తదుపరి హేరాఫేరి 3లోను అక్షయ్ - టబు కలిసి నటించే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి.