సూపర్‌స్టార్‌పై పెద్ద దర్శకుడి అక్కసు దేనికి?
సీనియర్లకు ఛాన్సులివ్వని వారి జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.
By: Tupaki Desk | 7 Oct 2024 12:30 AM GMTరాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కోటలు కొట్టుకుపోయాయి.. చూద్దామంటే చారిత్రక కట్టడాల ఆధారం కూడా కనిపించనంతగా నగరాలు విస్తరించాయి. మరి ఇదేవిధంగా కాలంతో పాటు మార్పు అన్ని పరిశ్రమలకు వర్తిస్తుంది. ఇక కోలీవుడ్ లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన కొందరు సీనియర్ ఔట్ డేటెడ్ దర్శకులకు అవకాశాలు ఇచ్చేందుకు కుర్రహీరోలు కాదు కదా సీనియర్ హీరోలే ముందుకు రావడం లేదు. సీనియర్లకు ఛాన్సులివ్వని వారి జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల రజనీ నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్ వంటి యువతరం దర్శకులతో కలిసి పని చేస్తున్నారు. అతడికి పురాతన కాలంలో హిట్లిచ్చిన సీనియర్లతో పని చేయడం లేదు.
అయితే ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో రజనీని డైరెక్ట్ చేసిన సూపర్ సీనియర్ కోలీవుడ్ డైరెక్టర్ చివరికి అవకాశాల్లేని స్థితిలో సూపర్ స్టార్ నే ఎటాక్ చేయడం ఆశ్చర్యపరిచింది. ఆయన మరెవరో కాదు .. వెటరన్ కేఎస్ రవికుమార్. ఈ జోడీ ఇంతకుముందు ముత్తు -నరసింహ అనే రెండు భారీ బ్లాక్‌బస్టర్‌లను అందించారు.
కానీ మూడో ప్రయత్నం ఇండస్ట్రీ డిజాస్టర్ మూవీని అందించారు. `లింగా` పంపిణీ వర్గాలను నిండా ముంచిన చెత్త సినిమా ఇది. రజనీకాంత్, అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా లాంటి భారీ తారాగణంతో భారీ బడ్జెట్ ని వెచ్చించి మరీ తెరకెక్కించారు. కానీ సరైన కథ కానీ, కథనం కానీ లేకుండా పేలవమైన సన్నివేశాలతో తీవ్రంగా నిరాశపరిచింది. నిజానికి ఎంతో భారీ ప్రచారం చూసి ఆశ్చర్యపోయాక... ప్రసాద్ లాబ్స్ (హైదరాబాద్)లో ప్రివ్యూ వీక్షించిన తెలుగు జర్నలిస్టులు వెంటనే పెదవి విరిచేసారు.
ఈ సినిమా దురదృష్ట వశాత్తూ పరాజయం పాలవ్వలేదు. తెలివైన వారంతా కలిసి చేసిన తప్పుల వల్ల ఫ్లాపైందని అర్థమైంది. ఇప్పుడు కేఎస్ రవికుమార్ చెప్పిన దాంట్లో హింట్ అందింది. అంతేకాదు ఈ సినిమాకి కేఎస్ కంటే రజనీకాంత్ ఎక్కువగా దర్శకత్వం వహించారని, ఆయన ఘోస్ట్ డైరెక్టర్ గా పని చేసారని కూడా అర్థమైంది. ఇంతకీ కేఎస్ చేసిన ఆరోపణలు ఏమిటీ అంటే...?
మూవీ ఎడిటింగ్ ప్రక్రియలో రజనీకాంత్ వేలు పెట్టారని.. CGI పనికి తగినంత సమయం ఇవ్వలేదని.. సినిమా రెండవ సగం మార్చారని ఆరోపించారు. అలాగే అనుష్క పాటను, క్లైమాక్స్‌లో కీలకమైన ట్విస్ట్‌ను తొలగించారు.
కృత్రిమ బెలూన్ జంపింగ్ సన్నివేశాన్ని రజనీయే జోడించారని కూడా విమర్శించాడు. ఇది సినిమా చూసేవారిని గందరగోళానికి గురిచేసింది. అంతేకాదు లింగాను పూర్తి చేయడానికి అవసరమైనంత సమయం అతడికి ఇవ్వలేదు. రజనీకాంత్ పుట్టినరోజు 12 డిసెంబర్ 2014న విడుదల చేయాలనే హడావిడి సమస్యలను మరింత పెంచింది. ఎందుకంటే నిర్మాణ సంస్థ సినిమాను త్వరగా పూర్తి చేయాలని దర్శకుడిపై ఒత్తిడి తెచ్చింది. ఇవన్నీ లింగా ఫ్లాపవ్వడానికి కారణమని విమర్శించారు కేఎస్. అయితే లింగా ఫ్లాపయ్యాక పంపిణీ వర్గాలు లబోదిబో మంటే వారందరినీ పిలిచి తన పారితోషికంలో సగం వెనక్కి ఇచ్చేశారు రజనీకాంత్. ఇక ఒక దర్శకుడి పనిలో హీరో వేలు పెట్టారంటే , ఆ దర్శకుడి పనితనం నచ్చలేదని కూడా అంగీకరించాలి.