Begin typing your search above and press return to search.

తమన్నా మరోసారి స్వింగ్‌ జర...!

తమన్నా కెరీర్‌ ఆరంభం నుంచి కూడా గ్లామర్‌ పాత్రలకు ఓకే చెబుతూ వచ్చింది.

By:  Tupaki Desk   |   1 April 2025 7:36 AM
తమన్నా మరోసారి స్వింగ్‌ జర...!
X

మిల్కీ బ్యూటీ తమన్నా సినీ కెరీర్‌ ప్రారంభించి రెండు దశాబ్దాలు అవుతోంది. కెరీర్‌ ఆరంభంలో తమన్నా ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ హ్యాపీడేస్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది. సీనియర్‌ స్టార్‌ హీరోల సినిమాల్లోనూ నటించిన అరుదైన ఘనత ఈ అమ్మడికి దక్కింది. అత్యధికంగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించిన రికార్డ్‌ తమన్నా పేరున ఉంటుంది అనడంలో సందేహం లేదు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కెరీర్‌ పరంగా కాస్త స్లో అయింది. హీరోయిన్‌గా ఆఫర్లు తగ్గినప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో బిజీ బిజీగానే ఉంటుంది. ముఖ్యంగా ఈమె ప్రత్యేక పాత్రలతో, ఐటెం సాంగ్స్‌తో అలరిస్తోంది.

తమన్నా కెరీర్‌ ఆరంభం నుంచి కూడా గ్లామర్‌ పాత్రలకు ఓకే చెబుతూ వచ్చింది. ఆమె కెరీర్‌ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్న సమయంలోనూ ఐటెం సాంగ్స్ చేయడం ద్వారా మాస్ ఆడియన్స్‌ను అలరించేందుకు ప్రయత్నించింది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన జై లవకుశ సినిమాలో స్వింగ్‌ జర అంటూ చేసిన డాన్స్‌ కి మాస్‌ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్వింగ్‌ జర సినిమా ఇప్పటికీ సోషల్ మీడియాలో షార్ట్‌ వీడియోల రూపంలో వైరల్‌ అవుతూనే ఉంటుంది. స్వింగ్‌ జర ఐటెం సాంగ్‌ తర్వాత తమన్నా వరుసగా ఆ ఆఫర్లను సొంతం చేసుకుంటూ వచ్చింది. ఈమధ్య కాలంలో జైలర్‌ సినిమాలో ఈమె చేసిన ప్రత్యేక పాట ఆ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే.

ఈమధ్య కాలంలో వచ్చిన స్టార్‌ హీరోల సినిమాల్లో తమన్నా ఐటెం సాంగ్‌ ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్ దేవగన్‌ నటిస్తున్న 'రైడ్‌ 2' సినిమాలో తమన్నాతో ఐటెం సాంగ్‌ చేయించాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రైడ్‌ 2 సినిమాకు రావాల్సిన బజ్ ఇప్పటి వరకు రాలేదు. సినిమా విడుదల తర్వాత ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే తమన్నాతో ఐటెం సాంగ్‌ చేయించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఆమెను సంప్రదించారని, ఆమె ఓకే చెప్పిందని తెలుస్తోంది.

బాలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రైడ్‌ 2 ఐటెం సాంగ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నాతో పాటు ప్రముఖ గాయని హనీ సింగ్‌ సైతం కనిపించబోతున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ పాటను త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్‌ ప్రారంభించిన తర్వాత వెంటనే రైడ్ 2 లో తమన్నా ఐటెం సాంగ్‌ గురించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైడ్‌ సినిమా సూపర్‌ హిట్‌ నేపథ్యంలో సీక్వెల్‌ను ప్రారంభించారు. కానీ సీక్వెల్‌కు అంతగా బజ్ క్రియేట్‌ కాకపోవడంతో మేకర్స్ తమన్నాను రంగంలోకి దించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరో వైపు తమన్నా ఓదెల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే.