నటి కస్తూరి ఎక్కడ? ఇంటికి తాళం.. ప్రత్యేక పోలీసుల పాట్లు
తెలుగు ప్రజలపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న సినీ నటి కస్తూరి ఇప్పుడు గాయబ్ అయ్యారు.
By: Tupaki Desk | 11 Nov 2024 4:14 AM GMTఅర్థం లేని వ్యాఖ్యలు చేయటం.. ఆధారాల్లేని మాటలతో తలనొప్పులు తెచ్చుకోవటం కొంతమంది ప్రముఖులకు అలవాటుగా మారింది. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడే మాటల కారణంగా అప్పటి వరకు ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని దెబ్బ తీసుకోవటంతో పాటు.. చట్టపరమైన చర్యల చిక్కుల్ని ఎదుర్కొంటున్నారు. తెలుగు ప్రజలపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న సినీ నటి కస్తూరి ఇప్పుడు గాయబ్ అయ్యారు.
బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ చెన్నైలో హిందూ మక్కల్ కట్చి సంస్థ ఒక ఆందోళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోట్లాది మంది తెలుగు వారి మనోభావాల్ని దెబ్బ తీసేలా మాట్లాడారు. ఒకవేళ.. ఆమె మాట్లాడిన మాటల్లో చారిత్రక ఆధారాలు కానీ వాస్తవాలు కానీ ఉంటే ఫర్లేదు. అందుకు భిన్నంగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన ఆమె మాటలకు తెలుగు వారి నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
తమిళనాడులోని తెలుగు వారైతే నటి కస్తూరి వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆమెపై పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆమెపై చర్యలకు డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వేళ ఆమెకు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లారు.
పోయెస్ గార్డెన్ లోని ఆమె ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. దీంతో.. ఆమె సెల్ ఫోన్ కు కాల్ చేయగా.. ఫోన్ స్విచాఫ్ చేసినట్లుగా గుర్తించారు. దీంతో.. ఆమె పరారీలో ఉన్నట్లుగా ప్రకటించారు. నటి కస్తూరిని గుర్తించేందుకు తమిళనాడు పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తన మాటలతో రేగిన వ్యతిరేకతను తగ్గించేందుకు ఆమె దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
తాను తెలుగు వారిని కించపరిచేలా మాట్లాడలేదని చెప్పిన ఆమె.. తన మాటలు నొప్పించి ఉంటే తనను క్షమించాలని కోరారు. అంతేకాదు తనకు తెలుగు నేల మెట్లినిల్లుగా పేర్కొన్న ఆమె.. తన వ్యాఖ్యలను డీఎంకే నేతలు వక్రీకరించారని పేర్కొన్నారు. నటి కస్తూరి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసుల నేపథ్యంలో ఆమె ఒక ప్రముఖ లాయర్ ను సంప్రదించి.. న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అరెస్టు ముప్పును తప్పించుకోవటమే ఆమెకో పెద్ద సవాలుగా భావిస్తున్నారు.
ఇంతకూ నటి కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని చూస్తే.. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంత:పుర మహిళలకు సేవ చేయటానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారని.. అలా వచ్చినోళ్లంతా ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నట్లుగా ఆమె పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పటానికి తెలుగు వారు ఎవరు? అని ఆమె ప్రశ్నించినట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడులోని తెలుగు వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. నటి కస్తూరి మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. చర్యల కోసం డిమాండ్ చేస్తున్నారు.