Begin typing your search above and press return to search.

'తమిళ రాకర్స్' మాఫియా పైర‌సీ టెక్నిక్ లీక్

అయితే జూలై 2024లో కేరళ సైబర్ క్రైమ్ పోలీసులు త‌మిళ‌రాక‌ర్స్ కి చెందిన ఒకానొక ఏజెంట్ జెబ్ స్టీఫెన్ రాజ్‌ను అరెస్ట్ చేయ‌డంతో కొన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

By:  Tupaki Desk   |   15 Oct 2024 3:23 PM GMT
తమిళ రాకర్స్ మాఫియా పైర‌సీ టెక్నిక్ లీక్
X

వేడి వేడి ప‌కోడాలు నాలుక‌కు అందించిన‌ట్టు, థియేట‌ర్లో సినిమాని వేడిగా ఉన్న‌ప్పుడే పైర‌సీలో ఫ్రీగా వ‌ద‌ల‌డం త‌మిళ‌రాక‌ర్స్ ప్ర‌త్యేక‌త‌. పైర‌సీ విద్య వారికి కొట్టిన పిండి. ద‌శాబ్ధాలుగా త‌మిళ‌రాక‌ర్స్ ఆట క‌ట్టించిన మొన‌గాడే పుట్ట‌లేదు. చాలామంది ప్ర‌య‌త్నించి విసిగిపోయారు. కొంత వ‌ర‌కూ రిజల్ట్ వ‌చ్చినా కానీ, సైబ‌ర్ క్రైమ్ వాళ్ల‌కు ఇప్ప‌టికీ త‌మిళ‌రాక‌ర్స్ వ్య‌వ‌హారం పూర్తిగా అంతు చిక్క‌డం లేదు.

అయితే జూలై 2024లో కేరళ సైబర్ క్రైమ్ పోలీసులు త‌మిళ‌రాక‌ర్స్ కి చెందిన ఒకానొక ఏజెంట్ జెబ్ స్టీఫెన్ రాజ్‌ను అరెస్ట్ చేయ‌డంతో కొన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 33ఏళ్ల స్టీఫెన్ రాజ్ మ‌ధురైకి చెందిన వ్య‌క్తి. కేర‌ళ‌-తిరువ‌నంత‌పురంలోని థియేట‌ర్ లో గుట్టు చ‌ప్పుడు కాకుండా రాయ‌న్ సినిమాను పైర‌సీ చేసి తమిళ్ రాకర్స్‌లో అప్‌లోడ్ చేసినందుకు అరెస్టు అయ్యాడు. అత‌డు 'రాయన్' స్క్రీనింగ్ సమయంలో పట్టుబడ్డాడు. సైబ‌ర్ క్రైమ్ కు చిక్కాక‌ అత‌డు చెప్పిన స‌మాచారం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

విచారణ సమయంలో స్టీఫెన్ రాజ్, ఐదుగురితో కూడుకున్న‌ అతడి బృందం సినిమాలను ఎలా రికార్డ్ చేశారో వెల్ల‌డించారు. అత‌డి విధానం ఏమిటంటే.. సినిమా రిలీజైన మొద‌టి రోజున ఐదుగురు ఒకేసారి థియేట‌ర్ క్యూలోకి వెళ‌తారు. అందులో మధ్యలో ఉన్న వ్యక్తి దుప్పటి కప్పుకుని దాని కింద కెమెరాను దాచిపెడ‌తాడు. ఐదు టిక్కెట్లు బుక్ చేసుకుని అప్పుడు థియేట‌ర్ లోనికి ప్ర‌వేశిస్తారు. అంటే ఈ ప‌నిని చాక‌చ‌క్యంగా పూర్తి చేసేందుకు ఒక‌టికి మించి టికెట్లు కొంటారు. దుప్ప‌టిలో దాచి ఉంచిన కెమెరాతో వారు సినిమాని రికార్డ్ చేస్తారు.

గత కొన్ని సంవత్సరాలుగా రూ.5,000 కోసం ఈ ప‌ని చేస్తున్నామ‌ని స్టీఫెన్ చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఒక‌ చిన్న కెమెరాను ఉపయోగించి థియేటర్లలో సినిమాని కాపీ చేస్తున్నామ‌ని స్టీఫెన్ రాజ్ చెప్పాడు. ఏదైనా సినిమా విడుదల స‌మ‌యంలో తమిళనాడు, కేరళ లేదా కర్ణాటకలోని థియేటర్లలో మొదటి రోజు ఐదు టిక్కెట్లను బుక్ చేసుకుంటామని అనుమానితుడు ఒప్పుకున్నాడు. లోపలికి వచ్చాక మధ్యలో కూర్చున్న వ్యక్తి ఒక దుప్పటి కప్పుకుని, రహస్యంగా దాచిన కెమెరాను ఉపయోగించి సినిమాని రికార్డ్ చేస్తాడు.

నిజానికి స్టీఫెన్ దొరికినా కానీ, అత‌డితో పాటు ఉన్న ఇత‌ర గ్యాంగ్ ఎవ‌రు? అన్న‌ది ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డి కాలేదు. ఇటీవ‌ల విడుద‌లైన ప‌లు కొత్త సినిమాలు త‌మిళ రాక‌ర్స్ లో డే వ‌న్ లోనే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూనే ఉన్నాయి. మొన్న విడుద‌లైన ర‌జ‌నీకాంత్ వేట్ట‌య్యాన్ చిత్రాన్ని, విక్ర‌మ్ తంగ‌ళ‌న్ చిత్రాన్ని కూడా త‌మిళ రాక‌ర్స్ లో చూస్తున్నారు జ‌నం. త్వ‌ర‌లో విడుద‌ల‌కు వ‌స్తున్న కంగువ‌కు ఈ ముప్పు ఉంది. ఇటీవ‌ల విడుద‌లైన ప‌లు తెలుగు చిత్రాలు త‌మిళ్ రాక‌ర్స్ లో ఉన్నాయి. అయితే అంత పెద్ద నెట్ వ‌ర్క్ వీళ్ల‌కు ఎక్క‌డిది? ఈ మాఫియాలో దాగి ఉన్న పెద్ద త‌ల‌కాయ‌లు ఎవ‌రు? అన్న‌ది ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌ప‌డ‌లేదు. జెబ్ స్టీఫెన్ రాజ్‌ని అరెస్టు చేసినప్పటికీ అధికారులు అత‌డే ప్రధాన నిర్వాహకుడు కాదని భావిస్తున్నారు. మొత్తం పైరసీ నెట్‌వర్క్‌ను కూల్చివేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నా ఈ నెట్ వ‌ర్క్ లో అస‌లు డాన్ ఎవ‌రో అంతు చిక్క‌డం లేదు.