Begin typing your search above and press return to search.

'రాయ‌న్' పైర‌సీ: త‌మిళ రాక‌ర్స్ గ్యాంగ్ స‌భ్యుడి అరెస్ట్

కొత్త సినిమాలను విడుదల రోజున కాపీ కొట్టి ఫేక్ వెర్షన్లను ఆన్ లైన్ లో షేర్ చేసే వారిలో ఒకరైన తమిళనాడుకు చెందిన స్టీఫెన్ రాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   28 July 2024 4:52 AM GMT
రాయ‌న్ పైర‌సీ: త‌మిళ రాక‌ర్స్ గ్యాంగ్ స‌భ్యుడి అరెస్ట్
X

త‌మిళ‌రాక‌ర్స్ మాఫియా పైర‌సీ అరాచ‌కాల గురించి ఇప్పుడే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఏ కొత్త సినిమా విడుద‌లైనా త‌మిళ్ రాక‌ర్స్ గుర్తుకు వ‌స్తుంది. వీళ్ల‌పై ఫిర్యాదులు త‌ప్ప‌నిస‌రి. కొన్నేళ్లుగా మ‌నం చూస్తున్న తంతు ఇది. తాజాగా మ‌రోసారి త‌మిళ్ రాక‌ర్స్ గ్యాంగ్ స‌భ్యుడు పోలీసుల‌కు చిక్కారు. తిరువనంతపురంలోని ఓ థియేటర్‌లో ధనుష్‌ నటించిన‌ `రాయన్‌` సినిమాని పైర‌సీ చేస్తుండగా తమిళనాడుకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసారు. కొత్త సినిమాలను విడుదల రోజున కాపీ కొట్టి ఫేక్ వెర్షన్లను ఆన్ లైన్ లో షేర్ చేసే వారిలో ఒకరైన తమిళనాడుకు చెందిన స్టీఫెన్ రాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

అత‌డు థియేట‌ర్‌లో కాపీ చేసే విధానంపైనా పోలీసులు వివ‌రాలు అందించారు. సినిమా విడుద‌ల రోజే ఆరు నుంచి ఏడు వెన‌క వైపు సీట్ల‌ను బుక్ చేస్తార‌ని, మొబైల్ ఫోన్ బ్రైట్‌నెస్ తగ్గించి సీటుపై కప్ హోల్డర్‌పై మొబైల్ ఫోన్ పెట్టుకుని థియేటర్ వెనుక సీట్లో కూర్చుని సినిమాని కాపీ చేస్తున్నార‌ని పోలీసులు చెబుతున్నారు. అతడు తమిళ్ రాకర్స్ - తమిళ్ బ్లాస్టర్స్ వంటి సైట్‌లకు కొత్త చిత్రాలను రికార్డ్ చేసి పంపేవాడు.

రాయ‌న్ తో పాటు, `గురువాయూరంబాలనదైల్` సినిమా విడుదలైన రెండో రోజునే ఈ చిత్రానికి సంబంధించిన ఫేక్ వెర్షన్ ఆన్ లైన్‌లోకి వచ్చింది. నిర్మాత సుప్రియా మీనన్ ఫిర్యాదు మేరకు కాక్కనాడ్ సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ చర్య తీసుకున్నారు. రైలులో కూర్చొని కొంతమంది తమ మొబైల్ ఫోన్‌లలో నకిలీ వెర్షన్‌ను చూస్తున్న దృశ్యాలు కూడా ఇటీవ‌ల‌ బయటపడ్డాయి. దీంతో నిర్మాతల్లో ఒకరైన సుప్రియా మీనన్‌ కాక్కనాడ్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అనంతరం సైబర్ పోలీసులు జరిపిన విచారణలో తిరువనంతపురంలోని థియేటర్ నుంచి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేర‌ళ త్రివేండ్రంలోని ఆరిస్ మ‌ల్టీప్లెక్స్ స‌ముదాయంలో ఓ స్క్రీన్ లో పైరేట్ లు కాపీ చేస్తూ ప‌ట్టుబ‌డ్డారు. వీరంతా మొబైల్ లోని 4కె వీడియో రికార్డింగ్ ఆప్ష‌న్ ని ఉప‌యోగించి సినిమాని కాపీ చేస్తున్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు.

కొత్త సినిమా విడుదలైన రోజే తమిళనాడు నుంచి కేరళకు ఫేక్ వెర్షన్స్ కాపీ కొట్టి వాటిని ప్రమోట్ చేస్తున్న ఛానెల్స్ కు పంపించ‌డం అరెస్ట‌యిన స్టీఫెన్ రాజ్ చేసే ప‌ని. అతని వెనుక పనిచేస్తున్న వ్యక్తులు ఎవరనేది కూడా తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఎవరికి సినిమాలను పంపిస్తున్నాడో, వెబ్‌సైట్లలో ఎవరు అప్‌లోడ్ చేస్తున్నారో కనుక్కోవాలి. నిందితుడి అరెస్ట్‌ అనంతరం దర్యాప్తును విస్తృతం చేస్తున్నామని సైబర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. అలాగే అరెస్ట్ అయిన వ్య‌క్తి పాటు ఉన్న మ‌రో వ్యక్తి అమాయకుడని, కొత్త సినిమా చూపిస్తానని, మంచి థియేటర్ అని చెప్పి నిందితుడిని తీసుకొచ్చారని పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసుల‌ విచారణలో తిరువనంతపురంలోని ఓ థియేటర్ నుంచి సినిమా కాపీ కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి సినిమా విడుదల రోజు ఈ థియేటర్‌కి రెగ్యులర్‌గా ఆరు లేదా ఏడు టిక్కెట్లు బుక్ చేయడం గమనించారు. అతడి మొబైల్ ఫోన్ లొకేషన్ తమిళనాడులో ఉన్నట్లు స్పష్టమైంది. అతడిని నిరంతరం పర్యవేక్షిస్తుండగా.. `రాయన్`ని చూసేందుకు వచ్చినట్లు సమాచారం. వంజియూర్ పోలీసుల సహాయంతో నిందితుడిని అరెస్టు చేసినట్లు కాకనాడ్ సైబర్ సెల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎ జయకుమార్ తెలిపారు.