Begin typing your search above and press return to search.

ట్రెండ్ సెట్ చేసిన దర్శకులు.. కమ్ బ్యాక్ ఇవ్వాల్సిందే..

సౌత్ ఇండియాలో అందరి దృష్టిని ఆకర్షించిన తమిళ్ స్టార్ డైరెక్టర్స్ అంటే వెంటనే శంకర్, మురుగదాస్, గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్ పేర్లు వినిపిస్తూ ఉండేవి

By:  Tupaki Desk   |   15 July 2024 4:29 AM GMT
ట్రెండ్ సెట్ చేసిన దర్శకులు.. కమ్ బ్యాక్ ఇవ్వాల్సిందే..
X

సౌత్ ఇండియాలో అందరి దృష్టిని ఆకర్షించిన తమిళ్ స్టార్ డైరెక్టర్స్ అంటే వెంటనే శంకర్, మురుగదాస్, గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్ పేర్లు వినిపిస్తూ ఉండేవి. వీరు కోలీవుడ్ కి మరుపురాని సక్సెస్ లు ఇచ్చారు. కోలీవుడ్ సినిమా అంటే కచ్చితంగా శంకర్ కి ఒక పేజీ ఉంటుంది. ఆ ఇండస్ట్రీ స్థాయిని శంకర్ తన సినిమాలతో పెంచారని చెప్పొచ్చు. ఏఆర్ మురుగదాస్ కూడా సోషల్ ఎలిమెంట్స్ ని కమర్షియల్ లైన్ లో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇక ప్రేమకథలు, కాప్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రెస్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఉండేవారు.

సెల్వ రాఘవన్ అనేసరికి లవ్ స్టోరీస్ తో పాటు, యుగానికి ఒక్కడు లాంటి విభిన్న కథలు మనకి గుర్తుకొస్తాయి. అయితే ఈ దర్శకులు గత కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులని మెప్పించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఈ జెనరేషన్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంతో విఫలం అయ్యి వరుస పరాజయాలు సొంతం చేసుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలలో సోషల్ కాన్సెప్ట్ కి తోడు బలమైన సంఘర్షణ కనిపిస్తుంది. అలాగే ప్రేక్షకులని కట్టిపడేసే ఎమోషన్స్ కూడా ఉంటాయి.

అయితే ఆయన నుంచి చివరిగా వచ్చిన స్నేహితుడా, ఐ, 2.ఓ, ఇప్పుడు ఇండియన్ 2 సినిమాలలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా మారాయి. గత సినిమాలలో ఉన్న ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ చిత్రాలలో పూర్తిగా మిస్ అయ్యాయి. గ్రాండ్ నెస్ కోసం ప్రయత్నం చేసి క్రమంలో అతని ఒరిజినాలిటీ మిస్ చేశారనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. ఇక ఏఆర్ మురుగదాస్ 2014లో సల్మాన్ ఖాన్ తో జయహో సినిమా చేశారు. ఆ సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. తరువాత కత్తి, సర్కార్ సక్సెస్ అయ్యాయి. అయితే స్పైడర్, దర్బార్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

2020లో వచ్చిన దర్బార్ తర్వాత మురుగదాస్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో మురుగదాస్ కథలు ఉంటున్నాయనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ తో సికందర్, శివకార్తికేయన్ తో ఒక సినిమా మురుగదాస్ చేస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకుడిగా 2016 నుంచి ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశారు. అందులో మూడు ఫెయిల్యూర్ అయ్యాయి. విక్రమ్ తో చేసిన దృవ నక్షత్రం మూవీ రిలీజ్ కి నోచుకోలేదు.

సెల్వ రాఘవన్ చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తారు. అతను చివరిగా 2022 లో నానే వరువన్ సినిమా ధనుష్ తో చేశారు. ఈ సినిమా ఒకే అనిపించింది. యుగానికి ఒక్కడు సీక్వెల్ చేస్తానని ప్రకటించాడు. ఎందుకనో అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం యాక్టర్ గా బిజీగా అయ్యారు. ఈ నలుగురు దర్శకులు తిరిగి మంచి కథలతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని వారి ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. శంకర్ నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. మురుగదాస్ సికందర్ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చు. గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్ నెక్స్ట్ మూవీస్ పై ఎలాంటి స్పష్టత లేదు.