ట్రెండీ టాక్: తమిళ తంబీలపై కేంద్రం కుట్ర చేసిందా?
దళిత నిరుపేదలకు జరిగిన అన్యాయం నేపథ్యంలో రూపొందించిన జైభీమ్ గొప్ప సినిమా
By: Tupaki Desk | 26 Aug 2023 7:24 PM GMTజాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను గురువారం న్యూఢిల్లీలో ప్రకటించారు. మాధవన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప: ది రైజ్‌లో తన నటనకు అర్జున్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోగా, ఆలియా భట్ - కృతి సనన్ (గంగూబాయి కతియావాడి- మిమీలలో తమ నటనకు) ఉత్తమ నటి అవార్డును షేర్ చేసుకున్నారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2021 సంవత్సరంలో దేశంలో విడుదలైన అత్యుత్తమ సినిమాల కోసం నిర్ధేశించినవి.
69వ జాతీయ అవార్డుల్లో తమిళ తంబీల ఆధిపత్యం కొనసాగుతుందని పలువురు భావించారు. కానీ అంతా రివర్సయింది. జాతీయ అవార్డులు వస్తాయి అనుకున్న వాటికి కూడా జూరీ ముఖం చాటేసిందన్న విమర్శలొచ్చాయి. తమిళ చిత్రం 'కర్ణన్'లో నటనకు ధనుష్ పై గొప్ప ప్రశంసలు కురిసాయి. సూర్య - జైభీమ్ లో అద్భుత ప్రదర్శనతో కట్టిపడేసాడు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఉత్తమ నటుడు అవార్డ్ వస్తుందని భావించినా కానీ నిరాశ ఎదురైంది. సర్పత్త పరంబరై -మాస్టర్ లాంటి చిత్రాలు పూర్తిగా ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాయి.
దీంతో తంబీల్లో తీవ్ర ఆగ్రహం పెళ్లుబికింది. దళిత నిరుపేదలకు జరిగిన అన్యాయం నేపథ్యంలో రూపొందించిన జైభీమ్ గొప్ప సినిమా అయినా కానీ.. ఒక డైలాగ్ లో ప్రాంతీయ ఫీలింగ్‌ను చూపించడం వల్ల కేంద్రం ఈ సినిమాని మరో ఆలోచన లేకుండా వెనక్కి నెట్టిందని గుసగుసలు వినిపించాయి. పా రంజిత్ స్పోర్ట్స్ డ్రామా సర్పత్త పరంబరై ఉత్తమ ప్రదర్శనలతో రంజింపజేసినా కానీ దానిని జూరీ పట్టించుకోలేదు. రకరకాల కారణాలతో తమిళ సినిమాలకు జాతీయ అవార్డుల్లో సరైన గుర్తింపు దక్కలేదు.
అయితే తంబీలు దీనివెనక రాజకీయ కారణాలు ఉన్నాయని కూడా కూపీ లాగుతున్నారు. కేంద్రంలోని భాజపా తంబీలకు మోకాలడ్డేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు అన్యాయం జరిగిందనే ఆవేదన సోషల్ మీడియాల్లో వ్యక్తమైంది.
అయితే మలయాళ - తెలుగు చిత్రాల్లోను ఆశించిన కొన్నిటికి అవార్డులు దక్కలేదన్నది గ్రహించి తీరాలి. తెలుగు సూపర్‌హిట్ RRR కూడా ప్రధాన అవార్డుల కేటగిరీలలో పక్కకు నెట్టివేయబడింది. ఉత్తమ నటుడు లేదా ఉత్తమ దర్శకుడు కేటగిరీలో పురస్కారం దక్కకపోవడంపై విమర్శలొచ్చాయి. కానీ ఆర్.ఆర్.ఆర్ సాంకేతిక విభాగాల్లో గౌరవాలను అందుకుంది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం పేరు పొందింది.
మలయాళ చిత్రాలు జోజి - మాలిక్‌లలో అద్భుత నటనకు ఫహద్ ఫాజిల్ ప్రశంసలు అందుకున్నాడు. థ్రిల్లర్ నయట్టు ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే గౌరవాన్ని పొందగా ప్రధాన పాత్రధారులు ఎవరికీ అవార్డులు లేవు. కుంచకో బోబన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ ఎవరికీ అవార్డు ఇవ్వలేదు. సజయన్ 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' చిత్రంలో విస్తృతంగా ప్రశంసలు పొందినా పురస్కారాల్లో లేదు. చిత్రనిర్మాత కేతన్ మెహతా నేతృత్వంలోని జ్యూరీచే గుర్తింపు దక్కించుకోలేదు.
జ్యూరీ సభ్యుడిగా ఉన్న మలయాళ చిత్ర నిర్మాత జి సురేష్ కుమార్ ఆసియానెట్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎనిమిది మలయాళ భాషా చిత్రాలు చివరి రౌండ్ పరిశీలనకు చేరుకున్నాయని వెల్లడించారు. జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి నేరుగా విజేతలకు తదుపరి తేదీలో అందజేయనున్నారు.