మెగాస్టార్ ఎలాంటి సినిమాలు చేయాలో చెప్పిన తమ్మారెడ్డి!
వరుస పరాజయాలతో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 17 Aug 2023 6:06 AM GMTవరుస పరాజయాలతో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. 'ఆచార్య' తర్వాత ఇటీవల రిలీజ్ అయిన 'భోళా శంకర్' తో విమర్శలు రెట్టింపు అయ్యాయి. 'ఆచార్య'కి పోటీగా 'భోళా శంకర్' ఆడిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. ఈ స్థాయిలో విమర్శలు ఇంతవరకూ చిరు సోషల్ మీడియాలో ఫేస్ చేయలేదు. తాజాగా దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా చిరంజీవికి ఎలాంటి సినిమాలు చేయాలో సలహా ఇచ్చారు.
'సహజత్వంతో కూడిన సినిమాలు చేయడం వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. ఒకప్పుడు చిరంజీవి అందరి కుటుంబంలో వ్యక్తిగా కనిపించేవారు. ఆ చిరంజీవి కనిపిస్తే మళ్లీ ఆ సినిమాలు ఆడతాయి. 'దంగల్' వంటి నేచురల్ ఫిల్మ్‌లో చిరంజీవి నటించినా ప్రేక్షకులు చూస్తారు. ఆ సినిమాలో అమీర్ ఖాన్ పెద్ద పొట్టతో ఉన్న ప్రేక్షకులు చూసారు. అది పాత్ర స్వభావం కాబట్టి అలా చేసారు. అలాంటి పాత్రలు చిరంజీవి చేసినా ప్రేక్షకులు చూస్తారు.
అప్పట్లో సినిమాల్లోకి వచ్చిన వారికి పని తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. ఇప్పటికీ సినిమాపై ప్రేమ ఉన్నవాళ్లు ఉన్నప్పటికీ.. చాలామంది సినిమాని వ్యాపారంగా చూస్తున్నారు. ఒ కప్పుడు రచయితలు సూటిగా కథలు మాత్రమే చెప్పేవారు. ఇప్పుడు ఓపెన్ చేస్తే అంటూ మొదలు పెట్టి ఎలివేషన్లు ఇస్తున్నారు. ఇందుకు దర్శకులే రచయితలు కావడం కారణమైంది. ప్రేక్షకులకు ఉపయోగ పడే ఏదో ఒక అంశం సినిమాలో ఉండాలి.
అది సహజంగా ఉండాలి. దానిని పక్కన పెట్టి ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని అంటే సినిమాలు ఆడటం లేదు. ఎన్టీఆర్ నుండి చిరంజీవి వరకు అందరూ తమ కెరీర్ ప్రారంభంలో మెథడ్ యాక్టింగ్ చేసిన వారే. ఇప్పుడు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చేసినా చూడటం లేదు. బలమైన కథ..కథనాలు కోరుకుంటున్నారు. అందులోనూ తప్పనిసరిగా కథ కొత్తగా ఉండాలంటున్నారు. వాళ్లకి ఏది కావాలో అది ఇవ్వగలిగినప్పుడే సినిమా హిట్ అవుతుంది' అని అన్నారు.