Begin typing your search above and press return to search.

‘తండేల్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. చైతూ ఎప్పుడొచ్చినా దుళ్లకొట్టేస్తాడా?

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 Nov 2024 11:43 AM GMT
‘తండేల్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. చైతూ ఎప్పుడొచ్చినా దుళ్లకొట్టేస్తాడా?
X

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం "తండేల్". గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. చైతూ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్‌లకు అనూహ్య స్పందన రావడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణ ముగిసింది. తాజాగా మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విడుదల తేదీని ప్రకటించారు.


'తండేల్' సినిమాని 2025 ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ''ప్రేమ తీరం నుండి భావోద్వేగాలతో నిండిన సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి'' అని పేర్కొంటూ ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో సముద్రపు అలల మధ్య నాగ చైతన్య, సాయి పల్లవి ఒకరినొకరు ఆప్యాయంగా గట్టిగా హగ్ చేసుకుని కనిపిస్తున్నారు. ఇది ఇద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీని, సినిమాలో వారి పాత్రల్లో లోతైన ప్రేమను సూచిస్తుంది. 'లవ్ స్టోరీ' జోడీ మరోసారి బిగ్ స్క్రీన్ మీద ఆకట్టుకోబోతున్నారని ఈ పోస్టర్ ని బట్టి తెలుస్తుంది.

నిజానికి 'తండేల్' సినిమాని ముందుగా క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేద్దామని నిర్మాతలు అనుకున్నారు. కానీ అనుకున్న సమయానికి వర్క్ కంప్లీట్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో, డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయడం సాధ్యం కాదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలో దింపాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారని టాక్ వచ్చింది. దర్శకుడు చందు మొండేటి సైతం జనవరి సినిమా రెడీగా ఉంటుందని చెప్పారు. అయితే పొంగల్ కు రిలీజ్ అయ్యే ఇతర సినిమాల నిర్మాతలతో ఉన్న సత్సంబంధాల దృష్యా, ఫెస్టివల్ సీజన్ లో రాకపోవచ్చనే అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు.

'తండేల్' సినిమాకి మంచి బజ్ ఉంది. నాగ‌చైత‌న్య - సాయి ప‌ల్ల‌విలది క్రేజీ కాంబినేషన్ కావడం, 'కార్తికేయ 2' తర్వాత డైరెక్టర్ చందు చేసిన మూవీ కావడం, గీతా ఆర్ట్స్ లాంటి ప్రముఖ బ్యానర్ నుంచే వచ్చే సినిమా కావడంతో అందరిలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలిపితే బాగుంటుందని అభిమానులు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫిబ్ర‌వ‌రికి షిఫ్ట్ చేయడంతో కాస్త నిరాశ చెందారు. అయితే ఈ సినిమా పొంగల్ క్లాష్ లో రావడం కంటే, వాలెంటైన్స్ డే కి ముందు ఫిబ్రవరి 7న సోలోగా రావడమే చాలా మంచిదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే నాగచైతన్య సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రిక‌ల్ డీల్స్ క్లోజ్ అయ్యాయ‌ని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ అత్యధికంగా రూ.40 కోట్ల‌కు డిజిట‌ల్‌ రైట్స్ ను కొనుగోలు చేసిందని స‌మాచారం. అలానే ఆడియో హక్కుల కింద మ‌రో రూ.10 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చాయ‌ని టాక్. ఎలాగూ హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కు మంచి డిమాండ్ ఉంది. ఇవి కూడా మంచి రేటుకే అమ్ముడ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. శాటిలైట్ రైట్స్ రూపంలో ఇంకొంత యాడ్ అవుతుంది. ఇవన్నీ క‌నీసం రూ.20 కోట్లు పలుకుతాయని అంచనా వేస్తున్నారు. సో మొత్తంగా నాన్ థియేట్రిక‌ల్ నుంచే ఈ సినిమా రూ.70 కోట్లు రాబ‌డుతోంది. సినిమాకి 80 కోట్ల వరకూ ఖర్చు చేసారని వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి, థియేట్రిక‌ల్ గా మ‌రో రూ.10 కోట్లు తెచ్చుకుంటే 'తండేల్‌' సినిమా సేఫ్ జోన్‌లో ఉన్నట్లే. ఇవన్నీ ఆలోచించే నిర్మాతలు సోలో డేట్ ను లాక్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది. ఏదేమైనా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని బట్టి చూస్తే, రిలీజ్ కు ముందే నిర్మాత‌లు లాభాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా 'తండేల్‌' సినిమా రూపొందుతోంది. ఇది లవ్, యాక్షన్, డ్రామా, అడ్రినలిన్ మూమెంట్స్ సమ్మేళనంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి శామ్‌దత్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.