Begin typing your search above and press return to search.

తనికెళ్ల భరణికి వ‌ర్శిటీ గౌరవ డాక్టరేట్‌

దాదాపు 800 సినిమాల పైచిలుకు చిత్రాల్లో నటించి తెలుగు వారందరు మా భరణి అనుకునేంతగా పేరుగాంచిన ఆయన అంద‌రివాడుగా మ‌న‌సుల్లో ఉన్నారు

By:  Tupaki Desk   |   25 July 2024 12:35 PM GMT
తనికెళ్ల భరణికి వ‌ర్శిటీ గౌరవ డాక్టరేట్‌
X

సుప్రసిద్ధ కవి, మాటల రచయిత, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు శ్రీ తనికెళ్ల భరణి అపార‌మైన సినీప‌రిజ్ఞానం, ప్ర‌తిభ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. దాదాపు 800 సినిమాల పైచిలుకు చిత్రాల్లో నటించి తెలుగు వారందరు మా భరణి అనుకునేంతగా పేరుగాంచిన ఆయన అంద‌రివాడుగా మ‌న‌సుల్లో ఉన్నారు.

టాలీవుడ్ దిగ్గ‌జాల్లో ఆయ‌న ఒక‌రు. గురువారం నాడు వరంగల్‌ ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ తనికెళ్ల భరణికి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. త‌నికెళ్ల భ‌ర‌ణి 52 సినిమాలకు మాటలను అందించి రచయితగా అనేక విజయాలను అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి `సముద్రం` సినిమాకు ఉత్తమ విలన్‌గా, `నువ్వు నేను` సినిమాలోని నటనకు ఉత్తమ క్యారెక్టర్‌ నటునిగా, `గ్రహణం`తో ఉత్తమ నటునిగా, `మిథునం` సినిమాకు గాను ఉత్తమ రచయిత.. ఉత్తమ దర్శకునిగా అయిదు నంది అవార్డులను అందుకున్నారు.

ఎస్‌ఆర్‌ యూనివర్శిటి ప్రకటించిన డాక్ట‌రేట్‌ను ఆగస్ట్ 3- శనివారం నాడు వరంగల్‌లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవ వేడుకలో ప్రధానం చేయనున్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ‌చరిత్ర ఉన్న ఈ విద్యా సంస్థ యూనివర్శిటిగా మారిన తర్వాత ఆస్కార్‌ అవార్డు గ్రహిత చంద్రబోస్‌ను గౌరవ డాక్టరేట్‌తో గతంలో సత్కరించింది.

చంపేస్తానని వార్నింగ్:

త‌నికెళ్ల భ‌ర‌ణి ఏపాటి గొప్ప‌ న‌టుడు? అన్న‌ది తెలుసుకోవ‌డానికి ఈ ఒక్క ఉదాహ‌ర‌ణ చాలు. ద‌శాబ్ధాల క్రితం విడుద‌లైంది `ఆమె` సినిమా. ఇందులో మ‌ర‌ద‌లు ఊహను రేప్ చేసే బావ‌గా త‌నికెళ్ల భ‌ర‌ణి న‌ట‌న‌కు జ‌నం ట్రామాలోకి వెళ్లారు. అలా ట్రాన్స్ లోకి వెళ్లిన కొంద‌రు మ‌హిళ‌లు త‌నికెళ్ల భ‌ర‌ణిని చంపేస్తామ‌న్నంత కోపంతో వార్నింగులు ఇచ్చారు అప్ప‌ట్లో. `అలీతో జాలీగా` ఇంట‌ర్వ్యూలో త‌నికెళ్ల భ‌ర‌ణి ఈ సంగ‌తిని వెల్ల‌డించారు. అది న‌ట‌న మాత్ర‌మే.. సినిమా కోసం అలా చేశాన‌ని వారించే ప్ర‌య‌త్నం చేసినా ``ఎంత సినిమా అయితే మాత్రం అలా చేస్తావా?`` అని నిల‌దీసిన ఆడాళ్లు ఉన్నార‌ట‌. కొంద‌రైతే చంపేస్తాన‌న్నంత కోపంగా చూసార‌ట‌. బ్యాడ్ విల‌న్ గా త‌న న‌ట‌న‌కు ఇలాంటివి చాలా ఎదుర‌య్యాయ‌ని తెలిపారు. న‌ట‌న‌ను పొగిడేవాళ్లున్నా తిట్లు తిన‌క‌ త‌ప్ప‌లేద‌ని భ‌ర‌ణి వాపోయారు.

ఇక‌పోతే త‌నికెళ్ల భ‌ర‌ణి మ‌హా శివ‌భ‌క్తుడు. నిత్యం భోళా శంక‌రునికి పూజలాచ‌రిస్తారు. అయితే ఇండ‌స్ట్రీ స్నేహితుల‌తో కెరీర్ ఆరంభం అలా మందేయ‌డంలో తాను ముందుండేవాడిన‌ని కూడా భోళాగా చెబుతారు.