ఉత్తరాదిన తారక మంత్రం ఫలిస్తుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Sep 2024 4:35 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27... డే1 చాలా ప్రశ్నలు సమాధానం లభిస్తుంది. పూర్తిగా క్లారిటీ వచ్చే కీలకమైన రోజు అది. తెలుగు రాష్ట్రాలు సహా ఉత్తరాదినా ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు గనుక సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభాస్ తర్వాత అత్యంత భారీ ప్రణాళికతో హిందీ మార్కెట్లోకి దూసుకెళుతున్న తెలుగు హీరోగా ఎన్టీఆర్ రికార్డులకెక్కుతున్నాడు. అయితే ప్రభాస్ రేంజులో అతడి పాచిక పారుతుందా? అంటే ఇప్పుడే చెప్పలేం. మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ తో పోలిస్తే దేవర ఎన్టీఆర్ కి సోలో సినిమాగా పరిగణించాలి. బాలీవుడ్ హీరోయిన్.. బాలీవుడ్ విలన్ లను ఎంపిక చేసుకుని ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి ఉత్తరాది బెల్ట్ లో ఏ మేరకు క్రేజ్ ఉంది? అన్నది ఇంకా అర్థం కాని గందరగోళంగా ఉంది.
అయితే అన్నిటినీ అధిగమించేందుకు ఎన్టీఆర్- కొరటాల బృందం ఉత్తరాది ప్రమోషన్స్ కి అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇటీవల దేవర బృందం అంతా ముంబైలో పాగా వేసి ప్రచారంలో వేడి పెంచుతోంది. కపిల్ శర్మ షో సహా వీలున్న ప్రతి వేదికపైనా దేవరకు ప్రమోషన్ తగ్గనీయడం లేదు. మరోవైపు డిజిటల్ గాను తమ సినిమాని థియేటర్లలో చూడాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు. ముంబైలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేసారు గనుక అక్కడ లోకల్ సినిమా అన్న ఫీలింగ్ తేవడానికి ప్రయత్నించారు. ఆలియా లాంటి బిగ్ స్టార్ దేవరకు కావాల్సినంత ప్రమోషన్ చేస్తోంది. పైగా దిగ్గజం కరణ్ జోహార్ స్వయంగా రిలీజ్ చేస్తూ తేవాల్సిన బజ్ తెచ్చారు. రెండు వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న సందీప్ వంగా ప్రచారం దేవరకు అడ్వాంటేజ్. ఇవన్నీ ఎన్టీఆర్ సినిమాకి ఏమేరకు ప్లస్ అవుతాయో ఇంకా చెప్పలేం.
ఏది ఏమైనా దేవరకు భారీ ఓపెనింగులు తేవడమే ధ్యేయంగా అటు ఉత్తరాదినా భారీ ప్రచారం చేస్తున్నారు. కంటెంట్ పరంగా అద్భుతంగా ఉంది అన్న టాక్ వచ్చి పాజిటివ్ సమీక్షలు పడితే దానికి తగ్గట్టే దేవర వసూళ్లకు ఢోఖా ఉండదు. ఇంతకుముందు విడుదలైన ట్రైలర్ కి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కానీ ట్రైలర్ తో పని లేకుండా సినిమాలో మ్యాటర్ ని ఎలివేట్ చేసి ఉంటే, జనతా గ్యారేజ్ తరహాలో ఆరంభ సమీక్షల్లో పాజిటివిటీ ఉంటే గనుక అది దేవర ఓపెనింగులకు కలిసిరావొచ్చు.
ఇటీవల తెలుగు సినిమాలకు ఉత్తరాదిన వెయిట్ పెరిగింది. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్లలో మన తెలుగు హీరోలకు ప్రాధాన్యత పెరగడం కలిసొచ్చే అంశం. ఇది మన హీరోల మార్కెట్ రేంజును పెంచుతోంది. ఉత్తరాదిన నెమ్మదిగా మనవాళ్లు దూసుకుపోవడానికి దారి దొరికింది. ఇదే అదనుగా దేవర1తో హిట్టు కొడితే ఎన్టీఆర్ నటించే దేవర 2 కి అది అన్నివిధాలా కలిసి వస్తుంది. బాహుబలి, సలార్ తరహాలో దేవరకు పాజిటివ్ సమీక్షలు పడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అంతా సస్పెన్స్. అసలేం జరగనుందో వేచి చూడాలి.