టికెట్‌పై వసూల్ చేసి కళాకారుల సంక్షేమ నిధి?
ప్రస్తుతం 1 లేదా 2 శాతం సెస్సును అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
By: Tupaki Desk | 20 July 2024 5:17 PM GMTసినిమా టికెట్లు, ఓటీటీ సబ్ స్క్రిప్షన్లపై 2శాతం సెస్ వసూలు చేయడం ద్వారా కళాకారుల సంక్షేమానికి నిధిని సేకరించే ప్రయత్నం జరుగుతోంది. ఆ మేరకు కర్నాటక ప్రభుత్వం ఆ రెండు కీలక విభాగాలపై 2 శాతం సెస్ వసూలు చేయాలని యోచిస్తోంది. ``కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల సామాజిక భద్రత సంక్షేమ నిధి`` పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తూ కర్ణాటక సినీ మరియు సాంస్కృతిక కార్యకర్తల (సంక్షేమం) బిల్లు-2024ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 1 లేదా 2 శాతం సెస్సును అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి మూడేళ్లకోసారి పన్ను శాతాన్ని సవరిస్తారు.
సేకరించిన సెస్ కర్ణాటక సినీ సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమ బోర్డుకు బదిలీ చేస్తారు. ఇందులో మంత్రి-ఇన్‌చార్జి (కార్మిక శాఖ), అదనపు ప్రధాన కార్యదర్శి/ప్రిన్సిపల్ సెక్రటరీ/సెక్రటరీ (కార్మిక శాఖ), లేబర్ కమిషనర్ వంటి సభ్యులు ఉంటారు. ఈ విభాగంలో ప్రభుత్వం నామినేట్ చేసిన 17 మంది సభ్యులు కూడా ఉన్నారు. వీరంతా సినీ పరిశ్రమలోని నటన, సాంకేతిక రంగానికి చెందిన వ్యక్తులుగా ఉంటారు.
కర్ణాటక చలనచిత్ర అకాడమీ, కర్ణాటక నాటక అకాడమీ, కర్ణాటక సంగీత నృత్య అకాడమీ, కర్ణాటక జానపద అకాడమీ, కర్ణాటక లలితకళా అకాడమీ, కర్ణాటక యక్షగాన అకాడమీ వంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన అకాడమీల కళాకారులు ఈ బిల్లు కింద కవర్ అవుతారు. వారందరి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలివైన ఎత్తుగడను అనుసరిస్తోంది. అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యాక మరిన్ని వివరాలు వెల్లడిస్తారు.