Begin typing your search above and press return to search.

జానీ మాస్టర్ వ్యవహారం.. తెలంగాణ బీజేపీ ఫుల్ సీరియస్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల వ్యవహారం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Sep 2024 9:30 AM GMT
జానీ మాస్టర్ వ్యవహారం.. తెలంగాణ బీజేపీ ఫుల్ సీరియస్
X

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల వ్యవహారం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నార్సింగి పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నెల్లూరులో ప్రస్తుతం జానీ మాస్టర్ ఉన్నారని వార్తలు వస్తుండటంతో అక్కడి పోలీసులను నార్సింగి పోలీసులు సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో బాధితురాలికి డాక్టర్స్ నేడు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. బాధితురాలి స్టేట్మెంట్‌ ను పోలీసులు రికార్డ్‌ చేశారని సమాచారం. ఇప్పటికే ఆమె నుంచి సఖి, భరోసా బృందాలు పలు వివరాలను సేకరించాయి. ఇప్పుడు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాధితురాలి ఇంటికి కూడా త్వరలో వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా జానీ మాస్టర్ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ స్పందించింది.

అసిస్టెంట్‌ లేడీ కొరియోగ్రాఫర్‌ గా పనిచేస్తున్న ఓ యువతిపై లైంగిక వేధింపుల విషయాన్ని తీవ్రమైన చర్యగా తాము భావిస్తున్నామని బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ అధ్యక్షురాలు డా.శిల్పారెడ్డి తెలిపారు. మైనర్‌ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని యువతి చెబుతోందని ఆమె అన్నారు. వేధింపులతో పాటు దాడులకు పాల్పడటం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు శిల్పా రెడ్డి చెప్పారు.

మత మార్పిడి చేసుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడమనేది కచ్చితంగా లవ్ జిహాద్ కేసు కిందకు వస్తుందని శిల్పారెడ్డి అభిప్రాయపడ్డారు. హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినట్లు స్పష్టం అవుతుందని చెప్పారు. ఎఫ్ఐఆర్‌ లో పలు విషయాలు ఉన్నప్పటికీ.. నిందితుడిపై వేరే కేసులు పెట్టారని ఆరోపించారు. ఇప్పటి వరకు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. పలువురి అండదండలు అతనికి ఉన్నట్లు తెలుస్తోందని ఆరోపించారు.

అయితే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, లైంగికంగా వేధించే ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని శిల్పా రెడ్డి ఆరోపించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చీమ కుట్టినట్లు కూడా వ్యవహరించకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ముఖ్యంగా తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అందుకు బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సదరు మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.