పరిశ్రమ పెద్ద దిక్కు ఇక దిల్ రాజు గారే!?
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డిసి) ఛైర్మన్ హోదాలో నిర్మాత దిల్ రాజు సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సి ఉంది.
By: Tupaki Desk | 8 Dec 2024 12:30 AMసినీపరిశ్రమ పెద్ద దిక్కు గురించి చాలా కాలంగా చర్చ సాగుతోంది. దర్శకరత్న దాసరి నారాయణరావు అనంతరం టాలీవుడ్ పెద్ద దిక్కు కోసం ఎంత ప్రయత్నించినా ఎవరూ దానిని భర్తీ చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి తనవంతు ప్రయత్నం చేసినా ఒక సెక్షన్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. దాంతో ఆయన కూడా ఇటీవల సైలెంట్ అయ్యారు.
ఇలాంటి సమయంలో పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి వారధిగా పని చేయాలని నియమిస్తూ దిల్ రాజును తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. దీని అర్థం .. ఇకపై సినీరంగం నుంచి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి అధికారిక హోదాలో చేరవేసేది పరిష్కారం కోరేది దిల్ రాజు మాత్రమే.
టాలీవుడ్ ఎలాంటి సంక్షోభంలోకి వెళ్లినా వెంటనే రెస్పాండ్ అయ్యి పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డిసి) ఛైర్మన్ హోదాలో నిర్మాత దిల్ రాజు సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సి ఉంది. అయితే దిల్ రాజును నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం యాధృచ్ఛికమా? ఆకస్మికంగా ఈ నిర్ణయం వెలువడడం వెనక కారణమేమిటి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి కారణం ఇటీవల పుష్ప 2 బెనిఫిట్ షో స్క్రీనింగ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ విషాదకర మరణం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందన్న గుసగుసా వినిపిస్తోంది. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం.. ఆమె కుమారుడు విషమ స్థితిలో ఉండటం నిజంగా ప్రభుత్వాన్ని కదిలించిందన్న చర్చా సాగుతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే థియేటర్ల వద్ద నిర్వహణ అవసరం. థియేటర్ల వద్ద మేనేజ్ మెంట్ సరిగా ఉండాలంటే సినీపరిశ్రమ వ్యక్తులతో మంతనాలు సాగించేందుకు ఒక వారధి అవసరం అని భావించడం వల్లనే రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషిస్తున్నారు.
దుర్ఘటన జరగడానికి కారణం తగినంత భద్రతా నిర్వహణ లేదు గనుకే అంటూ ప్రభుత్వం ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో టీఎఫ్‌డీసీ అధ్యక్షుడిగా దిల్ రాజు నియమితులయ్యారు. ఇలాంటి సమస్యలు ఏవి వచ్చినా వెంటనే పరిష్కరించుకునేందుకు పరిశ్రమ తరపున ఆయన సరిపోతారని భావించడం వల్లనే సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. దిల్ రాజు మాట్లాడి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయాల్సి ఉంటుంది.
ప్రతి పెద్ద సినిమా విడుదల సమయంలో నిర్మాతలు మొదటి వారంలో టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక ప్రీమియర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు నిర్వహించడం వంటి ఇతర సమస్యలపై అనుమతుల కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్య వారధి సరైన వ్యక్తి అయితేనే పరిష్కారం లభిస్తుంది. పరిశ్రమలో లోటు పాట్లు కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా దిల్ రాజు అయితేనే పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ ప్రభుత్వం భావించిందని కూడా విశ్లేషిస్తున్నారు. అనుభవజ్ఞులైన వ్యక్తులు పరిష్కారం ఇవ్వగలరనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ప్రభుత్వం తన ముందు ఉంచిన బాధ్యతను దిల్ రాజు ఏ మేరకు విజయవంతంగా నిర్వర్తిస్తారో వేచి చూడాలి.