Begin typing your search above and press return to search.

తెలంగాణలో 'క' విలేజ్.. ఇది తెలుసా?

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో కొదురుపాక అనే గ్రామంలో సూర్యోదయం లేట్ గా అయ్యి.. సూర్యాస్తమయం మాత్రం వేగంగా అయిపోతుంది.

By:  Tupaki Desk   |   3 Nov 2024 5:22 AM GMT
తెలంగాణలో క విలేజ్.. ఇది తెలుసా?
X

"మా ఊరు చుట్టూ ఎత్తైన కొండలున్నాయి.. కొండల మధ్య మా ఊరు ఉంది.. మధ్యాహ్నం మూడు అయ్యేసరికి సూర్యుడు కొండలు వెనక్కి వెళ్ళిపోయి.. ఆ నీడ మా ఊరి మీద పడి.. మూడింటికల్లా చీకటి పడిపోతుంది అబ్బాయి.." అంటూ 'క' సినిమాలో కృష్ణగిరి గ్రామాన్ని పెద్దాయన పరిచయం చేసిన డైలాగ్ గుర్తుందా? పోస్ట్ మ్యాన్ గా విధుల్లో చేరేందుకు వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఆ గ్రామానికి వెళ్లగా.. బ్లాక్ గ్రౌండ్ లో వస్తుంది ఆ డైలాగ్.

'క' సినిమాలో మధ్యాహ్నం మూడు గంటలకు చీకటి పడే కృష్ణగిరి గ్రామం లాంటి ఊరే నిజంగా ఉందన్న విషయం మీకు తెలుసా? తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో కొదురుపాక అనే గ్రామంలో సూర్యోదయం లేట్ గా అయ్యి.. సూర్యాస్తమయం మాత్రం వేగంగా అయిపోతుంది. సాయంత్రం నాలుగు గంటల కల్లా ఊర్లో చీకటి అయిపోతుంది. సాధారణంగా అందరికీ నాలుగు జాములు (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి) ఉంటాయి.

కానీ కొదురుపాక గ్రామస్థులు మాత్రం మూడు జాములతో అనేక ఏళ్లుగా జీవిస్తున్నారు. సూర్యోదయం 8 గంటల తర్వాత జరిగితే... సూర్యాస్తమయం 4 గంటలకు ముగుస్తుంది. దీంతో ఆ గ్రామాన్ని మూడు జాముల కొదురుపాక అని అందరూ అంటారు. పాము బండ గుట్ట, గొల్ల గుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్ట మధ్య ఆ గ్రామం ఉండడంతో.. సూర్యాస్తమయం తొందరగా సూర్యోదయం ఆలస్యంగా జరుగుతోందట.

కొన్ని వందల ఏళ్ల నుంచి అదే జరుగుతుండడంతో అక్కడి ప్రజలు అలవాటు పడిపోయారు. సాయంత్రం 4 కల్లా లైట్లు వేసుకుంటారు. తమ పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకుంటారు. అదే సమయంలో రంగనాయకుల గుట్టకు దగ్గరలో ఉన్న ఇళ్లకు చెందిన కొందరు గ్రామస్తులు వలస వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తమ గ్రామానికి కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం.. వాతావరణం చూసి ఆశ్చర్యపోతారని గ్రామస్థులు చెబుతున్నారు.

సాయంత్రం సమయంలో రావాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారని అంటున్నారు. అదే సమయంలో ఇప్పుడు కొదురుపాకకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలిసిన వారు ఓకే.. కానీ తెలియని వారు మాత్రం.. ఇది నిజమా.. అంటూ సెర్చ్ చేసి గ్రామం గురించి తెలుసుకుంటున్నారు.