పుట్టు పూర్వోత్తరాల నుంచి.. కాదేదీ ప్రచారానికి అనర్హం!
కాదేదీ కవితకనర్హం! అని మహాకవి శ్రీశ్రీ చెప్పుకొస్తే.. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కాదేదీ ఎన్నికల ప్రచారానికి అనర్హం అని నిరూపిస్తున్నారు
By: Tupaki Desk | 9 Nov 2023 11:30 PM GMTకాదేదీ కవితకనర్హం! అని మహాకవి శ్రీశ్రీ చెప్పుకొస్తే.. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కాదేదీ ఎన్నికల ప్రచారానికి అనర్హం అని నిరూపిస్తున్నారు. తాతతండ్రుల నుంచి పుట్టు పూర్వోత్తరాల వరకు నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. ''మా అమ్మ ఇక్కడే పుట్టింది. ఈ నియోజకవర్గంతో నాకు సాధారణ బంధం కాదు.. పేగు బంధం. మా అమ్మ తరఫు వారు ఇక్కడే ఉండేవారు'' అని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కామారెడ్డి సభలో తాజాగా వెల్లడించారు.
ఇక, ఇతర నేతల సంగతులు కూడా ఇలానే ఉన్నాయి. ఖైరతాబాద్ నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత.. విజయారెడ్డి.. ''మా నాన్న కూతురిగా చెబుతున్నా'' అంటూ.. తన తండ్రి పి.జే.ఆర్ కాలాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపిస్తున్నారు. ఖైరతాబాద్‌లో తన తండ్రి చేసిన అభివృద్ధి.. తను ఇక్కడే పుట్టి.. నెక్లస్ రోడ్డులో స్కేటింగ్ చేసిన సంగతులను ఆమె ప్రజల మధ్య గుర్తు చేసుకుని ప్రచారంలో ముందున్నారు. ఇదేవిధంగా అనేక మంది నాయకులు పుట్టు పూర్వోత్తరాలను ఏకరువు పెడుతున్నారు.
''కామారెడ్డి గడ్డతో నాకు పుట్టినప్పటి నుంచి ఎంతో అనుబంధం ఉంది. కోనాపూర్‌గా పిలుస్తున్న పోసానిపల్లి లో మా అమ్మ పుట్టింది. మా వాళ్లు చాలా మంది ఇక్కడే ఉన్నరు. అందుకే ఈ ప్రాంతంతో నాకు పేగు బంధమే ఉన్నది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలి రోజుల్లో కామారెడ్డికి చెందిన న్యాయవాదులు చైతన్యం చూపించారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నాం. కామారెడ్డిని జిల్లా చేస్తానని చెప్పా.. అలాగే చేసుకున్నం. జలసాధన ఉద్యమం 45 రోజులు చేశాం. ఆ ఉద్యమంలో బ్రిగేడియర్లను నియమించుకున్నాం. కామారెడ్డి బ్రిగేడియర్‌గా నేనే ఉన్న. అప్పటి సంది ఈ ప్రాంతానికి కొత్త కళ వచ్చె'' అని కేసీఆర్ గతాన్ని చాలా లోతుగా తవ్వేశారు. ఇదీ.. తెలంగాణ ఎన్నికల ప్రచార ముచ్చట.