నాని, నితిన్ కు 'మిగ్‌జాం' భయం..!
తెలంగాణలో కూడా మిగ్‌జాం తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తం కూడా చిరు జల్లులు కురుస్తూ జనాలను బయటకు రాకుండా చేస్తున్నాయి
By: Tupaki Desk | 5 Dec 2023 10:52 AM GMTఏపీని చిగురుటాకులా వణికిస్తున్న మిగ్‌జాం తుఫాన్ ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలోని బాపట్ల వద్ద తీరం దాటిన ఈ తుఫాన్ కారణంగా గంటకు వంద కిలోమీటర్ల మేరకు ఈదురు గాలులు వీస్తాయంటూ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో కూడా మిగ్‌జాం తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తం కూడా చిరు జల్లులు కురుస్తూ జనాలను బయటకు రాకుండా చేస్తున్నాయి. ఈ తుఫాన్ ప్రభావం ఎప్పటి వరకు, ఎంత వరకు అనే స్పష్టత లేకపోవడంతో ఈనెల 7వ తారీకు హాయ్ నాన్న సినిమాతో రాబోతున్న నాని, 8వ తారీకున ఎక్ట్స్‌ట్రా ఆర్డినరీ సినిమాతో రాబోతున్న నితిన్ టెన్షన్ పడుతున్నారు.
తుఫాన్ కి జనాలు బయటకు రావడమే కష్టం. అలాంటిది బయటకు వచ్చి థియేటర్ కు వెళ్లి సినిమాలు చూస్తారా అంటూ చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తుఫాన్ కి, చల్లటి గాలులకు బయటకు వెళ్లి థియేటర్ లో కూర్చుని సినిమాలు చూడటం కంటే ఓటీటీ లో వచ్చినప్పుడు హాయిగా చూడటం ఉత్తమం అని చాలా మంది అనుకునే అవకాశం ఉంది.
అందుకే ఈ తుఫాన్ తమ సినిమాల ఫలితాలపై, కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుందేమో అంటూ ఇద్దరు హీరోలు, ఆయా సినిమాల యూనిట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ లో గురువారం వాతావరణం సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీలో మాత్రం గురు, శుక్ర వారాల్లో కూడా వాతావరణం జనాలు బయటకు రాకుండా చేసే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ లో సినిమాలకు పెద్దగా ఇబ్బంది ఉండక పోవచ్చు. కానీ ఏపీలో మాత్రం ఈ రెండు సినిమాల వసూళ్లు కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఇప్పటికే అక్కడ అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వర్షాలు తగ్గినా కూడా నార్మల్ పరిస్థితులు రావడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది. కనుక ఏపీలో జనాలు థియేటర్ల కు వచ్చేనా అనేది చర్చనీయాంశంగా మారింది.