Begin typing your search above and press return to search.

వేణు స్వామి వివాదం: తెలంగాణ మహిళా కమిషన్ నుంచి సమన్లు

ప్రముఖుల వ్యక్తిగత జీవితాల గురించి జాతకాల విశ్లేషణలు చేస్తూ తరచుగా వివాదాల్లో నిలిచే వేణు స్వామి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు

By:  Tupaki Desk   |   13 Aug 2024 12:28 PM GMT
వేణు స్వామి వివాదం: తెలంగాణ మహిళా కమిషన్ నుంచి సమన్లు
X

ప్రముఖుల వ్యక్తిగత జీవితాల గురించి జాతకాల విశ్లేషణలు చేస్తూ తరచుగా వివాదాల్లో నిలిచే వేణు స్వామి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళల ఎంగేజ్మెంట్ సమయంలో చేసిన జాతకాల వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. అలాగే అభిమానులు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్, వేణు స్వామిపై చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ మహిళా కమిషన్ వద్ద ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి నేరెళ్ల శారద గారు వెంటనే స్పందించారు.

వేణు స్వామికి వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సమన్లు 22.08.2024 నాటికి హాజరు కావాలని కోరారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మినారాయణ, జనరల్ సెక్రటరీ వై.జె. రాంబాబు మరియు ఇతర సభ్యులు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అలాగే తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ నుండి కూడా ప్రముఖులు పాల్గొన్నారు.

గతంలో చాలాసార్లు వేణుస్వామి సమంత నాగచైతన్య రిలేషన్షిప్ గురించి కూడా పలు రకాల కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు కూడా అలానే నెగిటివ్ గా కామెంట్ చేయడంతో విషయం వివాదంగా మారింది. ప్రభాస్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఇక పొలిటికల్ గా కూడా ఆయామ చేసిన విశ్లేషణ రివర్స్ అయిన విషయం తెలిసిందే. ఆంద్రప్రదేశ్ లో జగన్ సర్కార్, తెలంగాణ లో మరోసారి కారు పార్టీ జోరు అని చెప్పారు. కానీ అవన్నీ జరగలేదు.

ఇక మంచు విష్ణు కూడా వేణుస్వామి వివాదంపై స్పందిస్తూ, వేణు స్వామిని సెలబ్రెటీల జాతకాలపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ సూచనలతో వేణు స్వామి మర్యాదపూర్వకంగా స్పందిస్తూ, ఇక సెలబ్రెటీలపై జాతక విశ్లేషణలు చేయడం మానుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక ఇంతలోనే ఇప్పుడు ఆయనకు మహిళా కమిషన్ నుంచి సమన్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంలో వేణుస్వామి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.