Begin typing your search above and press return to search.

ఇప్పుడే కాదు..1986 వ‌ర‌ద లోనూ ఇదే విరాళాల జోరు!

1986లో వరదల స‌మ‌యంలోనూ తెలుగు ఇండస్ట్రీ ఇలాగే స్పందించింది. అప్ప‌టి భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం పెరిగి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి లోతట్టు, లంక ప్రాంతాలు నీట మున‌గాయి.

By:  Tupaki Desk   |   8 Sep 2024 10:30 AM GMT
ఇప్పుడే కాదు..1986 వ‌ర‌ద లోనూ ఇదే విరాళాల జోరు!
X

ఏపీకి వ‌ర‌ద‌లు కొత్తేం కాదు. ఎప్పుడు ఎలాంటి విప‌త్తు ముంచుకొస్తుందో చెప్ప‌లేని పరిస్థితి. సుదీర్గ తీర రేఖ క‌లిగిన ప్రాంతం కావ‌డంతో ఏపీలో తుఫాన్లు అనేవి స‌ర్వ‌సాదార‌ణం. వాటిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌టం ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు అల‌వాటై ప‌నే. హుదూద్ లాంటి తుఫాన్లు ఎదుర్కున్న ప్ర‌జ‌ల‌కు వ‌ర‌ద‌లు పెద్ద లెక్క కాదు. కానీ స‌మాచారం లేకుండా వ‌ర‌ద నీరు మీద పడితేనే? ఇబ్బంది. ఇప్పుడు విజ‌య‌వాడను అలాగే ముంచెత్తింది బుడ‌మేరు వాగు.

దానికి తోడు భారీ వ‌ర్షాలు తోడ‌వ్వ‌డంతో ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌లే క‌పోయారు. ఇప్ప‌టికే చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. విప‌త్తుల స‌మ‌యంలో ఆప‌న్న హ‌స్తం తెలుగు చిత్ర ప‌ర‌శ్ర‌మ ఎప్పుడూ అందిస్తుంది. అవ‌స‌ర‌మైతే ఫండ్ రైజింగ్ ఈవెంట్లు సైతం చేయ‌డం తెలుగు ప‌రిశ్ర‌మ‌కే చెల్లింది. 1986లో వరదల స‌మ‌యంలోనూ తెలుగు ఇండస్ట్రీ ఇలాగే స్పందించింది. అప్ప‌టి భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం పెరిగి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి లోతట్టు, లంక ప్రాంతాలు నీట మున‌గాయి.

వంద‌లాంది మంది మృత్యువాత ప‌డ్డారు. ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ఏపీలో అతిపెద్ద నష్టం మిగిల్చిన వ‌ర‌ద అది. అప్పుడు కూడా చాలా మంది సెల‌బ్రిటీలు విరాళాలు అందించారు. సూపర్ స్టార్ కృష్ణ లక్ష, కృష్ణం రాజు 1.05 లక్షలు, బాలకృష్ణ 2.50 లక్షల రూపాయిలు, దాసరి నారాయణ రావు రూ. లక్ష, రామానాయుడు రూ. 50 వేలు, చిరంజీవి 50 వేల రూపాయలు, అక్కినేని నాగేశ్వరరావు 25 వేలు, అశ్వనీదత్ రూ. 10వేలు, విక్రమ్ యూనిట్ తరుఫున రెండున్నర లక్షలు అందించారు.

కొంత మంది బాలీవుడ్ సెల‌బ్రిటీలు స్పందించారు. జితేంద్ర, రాజేశ్ ఖన్నాలు కూడా తమ వంతుగా చెరో లక్ష విరాళ‌మిచ్చారు. రజనీకాంత్, కమల్ హాసన్ రూ. 50 వేలు, నగేష్ రూ. 10వేలు స‌హాయం అందించారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ ఒక్కొక్క‌రు చొప్పున 50 వేలు విరాళ‌మిచ్చారు. విజయశాంతి, మాధవి, సుజాత పదివేలు, సిల్క్ స్మిత, జయమాలిని ఐదు వేలు, సింగర్ సుశీల పదివేలు, శైలజ ఐదు వేలు సీఎం స‌హాయ నిధికి విరాళ‌మిచ్చారు.