Begin typing your search above and press return to search.

తొమ్మిదిలో ఆ ఒక్క సినిమాకే బజ్!

టాలీవుడ్ లో ఒకప్పుడు నవంబర్ నెలను డ్రై సీజన్ గా భావించేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి.

By:  Tupaki Desk   |   5 Nov 2024 5:57 AM GMT
తొమ్మిదిలో ఆ ఒక్క సినిమాకే బజ్!
X

టాలీవుడ్ లో ఒకప్పుడు నవంబర్ నెలను డ్రై సీజన్ గా భావించేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. మంచి కంటెంట్ తో సినిమా తీస్తే చాలు, సీజన్ తో పనిలేకుండా జనాలు థియేటర్లకు తరలి వస్తారనే అభిప్రాయానికి వచ్చేసారు. అందుకే నవంబర్ లోనూ క్రేజీ మూవీస్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 14న 'కంగువ', 'మట్కా' లాంటి పాన్ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అంతకంటే ముందుగా ఈ శుక్రవారం తొమ్మిది సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాయి.

నిఖిల్ సిద్దార్థ, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ''అప్పుడో ఇప్పుడో ఎప్పుడో''. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 8న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఉంది. లేటెస్టుగా వచ్చిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ‘స్వామిరారా’ ‘కేశవ’ తర్వాత దర్శక హీరోల కాంబోలో రాబోతున్న మూవీ కావడంతో, ఇదేదే మంచి విషయమున్న సినిమానే అయ్యుంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు.

హెబ్బా పటేల్, చేతన్ కృష్ణ జంటగా నటించిన 'ధూం ధాం' చిత్రం ఈ శుక్రవారమే విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. శ్రీను వైట్ల, వైవీఎస్ చౌదరి, సాయి రాజేష్ లాంటి దర్శకులను తీసుకొచ్చి గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. ఇక అదే రోజున ‘బాహుబలి’ నటుడు రాకేశ్‌ వర్రే హీరోగా నటించిన ''జితేందర్‌ రెడ్డి'' అనే సినిమా రిలీజ్ అవుతోంది. వీటితో పాటుగా 'జాతర', 'ఈసారైనా?!', 'రహస్యం ఇదం జగత్‌', 'వంచన', 'జ్యూయల్ థీఫ్' వంటి మరో ఐదు చిన్నా చితక సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.

అయితే వీటికి ఒకరోజు ముందుగా, అంటే నవంబరు 7వ తారీఖున 'బ్లడీ బెగ్గర్' అనే తమిళ డబ్బింగ్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 'జైలర్' డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో దాదా ఫేమ్ కెవిన్ హీరోగా నటించారు. దీపావళి కానుకగా గత వారం తమిళంలో రిలీజైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, మంచి థియేటర్లు దొరికే అవకాశం ఉంది.

ఇలా ఈ వారం 9 సినిమాలు థియేటర్లలోకి రావడానికి రెడీ అయ్యాయి. కాకపోతే సినీ ప్రియులు వీటిపై ఏమంత ఆసక్తి చూపిస్తున్నట్లు అనిపించడం లేదు. ఉన్నంతలో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీకి మంచి బజ్ ఉంది. నిఖిల్, సుధీర్ వర్మల కలయికలో వస్తోన్న సినిమా కావడంతో అంతో ఇంతో జనాల దృష్టి పడింది. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న దర్శక హీరోలు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రమోషన్స్ లో భాగం అవుతున్నారు. చూస్తుంటే ఈ సినిమాకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందనిపిస్తోంది. 'ధూం ధాం' కూడా ప్రమోషన్స్ తో సందడి చేస్తోంది. మరి వీటిల్లో ఏయే సినిమాలు ఆడియన్స్ ను థియేటర్లకు రప్పిస్తాయో? బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో? చూడాలి.