Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్, డాకు మహారాజ్.. టిక్కెట్ రేట్లలో సడన్ ట్విస్ట్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్ సినిమాల టికెట్ ధరల్ని పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

By:  Tupaki Desk   |   8 Jan 2025 7:51 AM GMT
గేమ్ చేంజర్, డాకు మహారాజ్.. టిక్కెట్ రేట్లలో సడన్ ట్విస్ట్!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్ సినిమాల టికెట్ ధరల్ని పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోలతో పాటు 14 రోజుల పాటు టికెట్ ధరలని పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తూ జీవో కూడా జారీ చేసింది. టికెట్ ధరలు పెంచడం వలన సంక్రాంతి ఫెస్టివల్ టైంలో సినిమాలకి భారీ కలెక్షన్స్ గ్యారెంటీ అని మేకర్స్ భావిస్తున్నారు.

‘గేమ్ చేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏపీలో నిర్వహించారు. ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ని అనంతపురంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా వాళ్ళకి ఏపీ ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉంది. పెద్ద సినిమాలు అన్నింటికి కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తున్నారు. తాజాగా గేమ్ చేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టికెట్ ధరల పెంపుపైన కీలక వ్యాఖ్యలు చేశారు.

టికెట్ ధరలు పెంచిన కూడా అందులో 18 శాతం జీఎస్టీ ప్రభుత్వానికి వస్తుందని అన్నారు. తెలుగు సినిమా స్టాండర్డ్స్ పెరిగిన నేపథ్యంలో నిర్మాతలు పెద్ద బడ్జెట్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో మూవీస్ చేయాలంటే పెట్టిన పెట్టుబడి రికవరీ వచ్చేలా ఉండాలని అన్నారు. అందుకే ధరలపై ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ గా ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ టికెట్ ధరలని 14 రోజుల వరకు కొనసాగించుకోవడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం హై కోర్ట్ సూచనల మేరకు జీవోలో కొన్ని మార్పులు చేయనుందని అంటున్నారు.

14 రోజుల స్థానంలో కేవలం 10 రోజులకి మాత్రమే ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ జీవో సవరించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పెద్ద సినిమాలు పెంచిన ధరలతో టికెట్స్ అమ్ముకోవడానికి 10 రోజుల సమయం చాలనే మాట వినిపిస్తోంది. ఇది మేకర్స్ కి అంత ఇబ్బందికరంగా ఉండదని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణాలో మాత్రం సంక్రాంతి సినిమాల టికెట్ ధరలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అన్ని రకాలుగా పరిశీలించి ఈ రోజు దీనికి సంబందించి అఫీషియల్ ప్రకటన ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన సినిమాల టికెట్ ధరల పెంపుపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.