తెలుగు సినిమా.. ఇప్పుడు 'పాన్ ఇండియా' కాదు, 'పాన్ వరల్డ్'
RRR తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తమైంది. భాషా ప్రాంతీయత, దేశ విదేశీ సరిహద్దులను చెరిపేసి గ్లోబల్ వైడ్ గా సత్తా చాటింది.
By: Tupaki Desk | 28 Feb 2024 1:45 PM GMTఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 'పాన్ ఇండియా' సినిమాలు చాలా సర్వ సాధారణం అయిపోయాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ.. అందరూ పాన్ ఇండియా జపం చేస్తున్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకూ అంతా నేషనల్ వైడ్ పాపులారిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిలిం మేకర్స్ సైతం అదే ఆలోచనలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. వారిలో కొందరు యూనివర్సల్ సబ్జెక్ట్ తో అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తుంటే, మరికొందరు మాత్రం మార్కెట్ క్రేజ్ కోసం మల్టీలాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో 'పాన్ వరల్డ్' అనే కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతోంది.
RRR తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తమైంది. భాషా ప్రాంతీయత, దేశ విదేశీ సరిహద్దులను చెరిపేసి గ్లోబల్ వైడ్ గా సత్తా చాటింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం, వందేళ్ల భారతీయ సినిమాకి 'ఆస్కార్ అవార్డ్' కలను సాకారం చేసి పెట్టింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ తో పాటుగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకుంది. దీంతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మన సినిమాల గురించి చర్చ జరుగుతోంది. ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యే తెలుగు కంటెంట్ గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తుండటంతో.. ఇతర దేశాల్లోనూ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఫిలిం మేకర్స్ అందరూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి తగ్గట్టుగా హై టెక్నికల్ వాల్యూస్ తో, బడ్జెట్ కు ఏమాత్రం వెనకాడకుండా సినిమాలు తెరకెక్కిస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'కల్కి 2898 AD'. హిందూ పురాణాల ఆధారంగా ఈ ఎపిక్ సోషియో ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్రీ.శ. 3102 నుండి క్రీ.శ. 2898 మధ్య జరిగే కథతో.. ఆడియన్స్ ను సరికొత్త ఊహాజనితమైన ఫ్యూచర్ వరల్డ్ లోకి తీసుకెళ్లడానికి టీమ్ కృషి చేస్తోంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా హై క్వాలిటీ ప్రొడక్ట్ అందించడానికి కష్టపడుతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ఈ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతోందో శాంపిల్ గా చూపించింది.
'కల్కి 2898 AD' అనేది ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కానుంది. భారతీయ భాషల్లోనే కాదు, పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది శాన్ డియాగో కామిక్-కాన్ ఈవెంట్ లో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి, గ్లోబల్ వేదికపై సినిమా గురించి డిస్కషన్ జరిగేలా చేసారు. అలానే ప్రతిష్టాత్మక ఈవెంట్ లో పాల్గొన్న తొలి భారతీయ సినిమాగా ‘ప్రాజెక్ట్ K’ రికార్డు సృష్టించింది. ఇది కచ్చితంగా భౌగోళిక సరిహద్దులను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. మే 9న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప: ది రూల్' కూడా పాన్-వరల్డ్ ఫిల్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' అదృష్టవశాత్తూ పాన్ ఇండియా సక్సెస్ సాధించినప్పటికీ, ఇప్పుడు 'పుష్ప 2' తో ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటాలని చిత్ర బృందం భావిస్తోంది. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న బన్నీ.. ఇటీవల తన టీంతో కలిసి బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ వంటి ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫారమ్‌లలో దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. 'పుష్ప 1' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించడం ద్వారా, 'పుష్ప 2' ను ఒక భారతీయ సినిమాగా కాకుండా గ్లోబల్ సినిమాటిక్ అనుభవంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. 2024 ఆగష్టు 15న ఈ మూవీ విడుదల కానుంది.
ఎస్ఎస్ రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే యాక్షన్ అడ్వంచర్ మూవీ. ఇదొక గ్లోబ్ ట్రాటనింగ్ యాక్షన్ మూవీ అని, 'ఇండియానా జోన్స్' తరహాలో అడ్వెంచరస్ గా ఉంటుందని జక్కన్న స్వయంగా వెల్లడించారు. ఇండియన్ సినిమాలోనే అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. RRR చిత్రంతో రాజమౌళి వెస్ట్రన్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడమే కాదు, స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజాల ప్రశంసలు పొందారు. అందుకే ఆయన్నుంచి రాబోయే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం గ్లోబల్ వైడ్ గా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జక్కన్న సామర్థ్యం ఏంటో తెలుసు కాబట్టి, SSRMB భారతీయ సినిమా సరిహద్దులను చెరిపేసి, నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.
ఇప్పటికైతే టాలీవుడ్ నుంచి 'కల్కి 2898 AD', 'పుష్ప 2', మహేష్ బాబు-రాజమౌళి సినిమాలు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కేటగిరీలో ఉన్నాయని చెప్పాలి. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఇంకెన్ని చిత్రాలు రూపొందుతాయో చూడాలి.