రష్మికకు తెలుగు జర్నలిస్టుల మద్ధతు
మార్ఫింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెలబ్రిటీలు ఎదుర్కుంటున్న సమస్య. నటీమణుల మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి
By: Tupaki Desk | 8 Nov 2023 3:32 PM GMTమార్ఫింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెలబ్రిటీలు ఎదుర్కుంటున్న సమస్య. నటీమణుల మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. ఇది ఒక సామాజిక విపత్తుగా మారింది. ఇటీవల పాపులర్ కథానాయిక రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ సమయంలో రష్మిక ఉద్వేగభరితమైన ఆవేదనతో కూడుకున్న నోట్ అందరి హృదయాల్ని కదిలించింది.
ఇందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని రష్మిక నివేదించింది. ఇక రష్మికకు సాటి నటీమణులు, ప్రముఖ సెలబ్రిటీల నుంచి మద్ధతు లభించింది. అమితాబ్ బచ్చన్, నాగచైతన్య, మృణాల్ ఠాకూర్ సహా పలువురు ఈ దుశ్చర్యను ఖండించడమే గాక కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇప్పుడు తెలుగు సినిమా జర్నలిస్టుల నుంచి రష్మికకు మద్ధతు లభించింది. ఈ దుశ్చర్యను తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించింది. ఫిల్మ్ జర్నలిస్టుల సంఘం ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ గారు , జనరల్ సెక్రటరీ రాంబాబు గారు తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ గారికి దీనిపై పిర్యాదు చేసారు. బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అభినందించిన అంజనీ కుమార్ వెంటనే ఈ కేస్ ను సైబర్ క్రైం శాఖకు అప్పగించారు. ఇలాంటి చర్యలు జరిగిన వెంటనే తమ దృష్టి కి తీసుకురావాలని సూచించారు.
రష్మిక సౌతిండియా పరిశ్రమల్లో, అలాగే బాలీవుడ్ లోను బిజీ కథానాయిక. ప్రస్తుతం వరుసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ నేషనల్ హీరోయిన్ గా వెలిగిపోతున్నారు. ఇలాంటి సమయంలో మార్ఫింగ్ వీడియో కలకలం సృష్టించింది. దీనిపై సైబర్ క్రైమ్ సీరియస్ గా దృష్టి సారించనుందని సమాచారం.