బన్నీలా మిగతా వాళ్లెందుకు మాట్లాడరు?
తెలుగు అమ్మాయిలు సినిమాలు వైపు ఆసక్తి చూపించకపోవడానికి కారణం కూడా ఈ రకమైన ప్రచారమని కొందరంటున్నారు.
By: Tupaki Desk | 28 July 2023 6:00 AM ISTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో కి తెలుగు అమ్మాయిలు రావాలని ఎంతో బలంగా కోరుకున్న నటుడు అల్లు అర్జున్. తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో రాణించాలని తన బలమైన కోరికను ఎంతో బలంగా చెప్పారు. ఆయన అలా ఓపెన్ అవ్వడానికి యూట్యూబర్ వైష్ణవిచైతన్య ప్రధాన కారకురాలు. 'బేబి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సందర్భంగానే బన్నీ తన మనసులో మాటని ఎంతో ఓపెన్ గా బయట పెట్టారు. బన్నీ ఎంతో గ్రాండ్ గా తెలుగు అమ్మాయిలకు స్వాగతం పలికాడు. ఇక్కడ మేమున్నాం..ఇది మన ఇండస్ట్రీ.. తల్లిదండ్రులు నమ్మకంతో తమ పిల్లల్ని పరిశ్రమకి పంపించండని ఓ భరోసా కల్పించారు.
ఇలా వ్యాఖ్యానించడం నిజంగా గ్రేట్ అనే అనాలి. అలాగే బన్నీ తండ్రి..నిర్మాత అల్లు అరవింద్ కూడా తెలుగు అమ్మాయిలు పరిశ్రమకి రావాలి అని సానుకూలంగా స్పందించారు. ఇంతవరకూ తెలుగు అమ్మాయిల ప్రవేశాన్ని ఉద్దేశించి ఏ హీరో గానీ.. ఏనటుడు గానీ..ఏ నిర్మాతగానీ.. ఎక్కడా ..ఏ సందర్భం లోనూ అనలేదు. కనీసం మాట వరసకు కూడా ఆహ్వానించిన పరిస్థితి లేదు. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలున్నారు. తరతరాలు గా పరిశ్రమలో కొనసాగుతున్నారు. వాళ్ల వారసత్వాలు కొనసాగుతున్నాయి. ప్రపంచం ఎంతో ముందుకు పోతుంది.
ఆ ప్రపంచంలో భారతదేశం ఎంతో ముందజలో కొనసాగుతుంది. సాంకేతికంగా ఎంతో అభివృద్దిలో ఉన్నాం. కానీ బన్నీలా స్వేచ్ఛగా తెలుగు అమ్మాయిలు పరిశ్రమకి రండి అని ఒక్క హీరో కూడా అనలేకపోతున్నారు. మరి ఇలా అనలేక పోవడానికి కారణాలు అనేవి వాళ్ల వ్యక్తిగతానికి సంబంధించి నవిగానే భావించాలి. ఏ కారణంతో తెలుగు అమ్మాయిలు పరిశ్రమకి రండి..ప్రోత్సహిస్తాం? అని అనలేకపోతున్నారో? వాళ్లకే తెలియాలి.
ఇక పరిశ్రమకి చెందిన కుమార్తెలు..కుమారులు మాత్రం ధైర్యంగా మ్యాకప్ వేసుకుంటారు. వాళ్లకి గ్రాండ్ గా వెల్కమ్ చెబుతారు. అలాగే పరభాషల నుంచి వస్తోన్న హీరోయిన్లను సైతం ఎంతో అద్భుతంగా సాదర స్వాగతం పలుకుతున్నారు. వాళ్లని ప్రోత్సహించడంలో హీరోలంతా ముందుంటారు. అందుకు వాళ్ల పాత ఇంటర్వ్యూలే సాక్ష్యాలు. ప్రయత్నం చేస్తే అవకాశం వస్తుందని చెప్పరు కానీ...పరభాష నుంచి వచ్చిన బ్యూటీల్ని మాత్రం ఓ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తారు.
మరి ఈ తారతమ్యం ఎందుకొస్తుంది? అన్నది ఆ పెరుమాళ్లకే తెలియాలి. హీరోలంతా దైర్యంగా మాట్లాడినప్పుడే పరిశ్రమపై ఉండో అపోహలు..మచ్చలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. కానీ ఎక్కువగా ఫోకస్ అయ్యేది సినీ పరిశ్రమలోనే. ఏదో ఒక ఇండస్ట్రీలో జరిగితే అన్ని పరిశ్రమల్లోనూ ఇంతే అనుకుంటారు.
కారణం ఏంటి? అని విశ్లేషించగా ఎవరూ నోరు మొదపక పోవడం వల్లే ఇలా జరుగుతుందని కొందరు నిర్మాతలు అంటున్నారు. తెలుగు అమ్మాయిలు సినిమాలు వైపు ఆసక్తి చూపించకపోవడానికి కారణం కూడా ఈ రకమైన ప్రచారమని కొందరంటున్నారు. మరి ఈ ఈపోహల్ని తొలగించాల్సిన బాద్యత ఎవరిపై ఉందంటారు. సినీ పెద్దలు- దర్శక-నిర్మాతలతో పాటు హీరోలపై లేదంటారా?!