ఎన్నికల వేడి.. ఆ చిత్రాల పరిస్థితేంటి?
దీంతో ఈ రోజు నుంచి పోలింగ్ డేట్ వరకు ఫుల్ గా ఎలక్షన్ మ్యానియా నడుస్తుంది. ప్రజలంతా తమ దృష్టిని రాజకీయాలపైనే పెడతారు.
By: Tupaki Desk | 18 April 2024 7:16 AM GMTదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువ ఉంది. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో తలమునకలయ్యాయి. కార్యకర్తలు కూడా బిజీగా నాయకుల వెంట తిరుగుతున్నారు. ఇక తాజాగా ఈసీ.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీంతో ఈ రోజు నుంచి పోలింగ్ డేట్ వరకు ఫుల్ గా ఎలక్షన్ మ్యానియా నడుస్తుంది. ప్రజలంతా తమ దృష్టిని రాజకీయాలపైనే పెడతారు. మరోవైపు, విద్యార్థులకు సెలవులు అయినా.. ఐపీఎల్ పైనే ఫోకస్ అంతా పెట్టేశారు. అలా సినీ ప్రియుల దృష్టి మూవీలపై తగ్గిందనే చెప్పాలి. మరి ఈ ఎన్నికల క్రుషియల్ టైమ్ లో రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి ఏంటోనని నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది.
ఇటీవల రిలీజైన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీ.. సూపర్ హిట్ అయింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ చిత్రం మిక్స్ డ్ టాక్ అందుకుంది. ఇక ఎప్పటి లాగే.. ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. మార్కెట్ మహాలక్ష్మి, శరపంజరం, తెప్ప సముద్రం, పారిజాత పర్వం, టెనెట్ సహా పలు చిత్రాలు.. శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఆ తర్వాత వారం.. నారా రోహిత్ ప్రతినిధి-2, దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ లవ్ మీతోపాటు విశాల్ రత్నం సినిమాలు రిలీజ్ కానున్నాయి. మేలో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో పాటు అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు, సుహాస్ ప్రసన్న వదనం, సత్యదేవ్ కృష్ణమ్మ సహా అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కల్కి కూడా మే నెలలో రావాల్సి ఉన్నా.. వాయిదా పడడం ఖరారు అయినట్లే.
అలా ఈ ఎలక్షన్ టైమ్ లో చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ప్రజలు.. ఏమేరకు వీటిని ఆదరిస్తారో చూడాలి. కొన్ని సినిమాల మేకర్స్.. తమ చిత్రాల కంటెంట్ పై నమ్మకం ఉందని చెబుతున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే.. ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేకుండా థియేటర్లకు ప్రజలు తరలివస్తారని అంటున్నారు. మరి ఆ సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.