సంధ్య థియేటర్ ఘటన.. రేవతి ఫ్యామిలీకి అండగా TFCC
ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
By: Tupaki Desk | 23 Dec 2024 9:37 AM GMTపుష్ప 2: ది రూల్ మూవీ ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొక్కిసలాట జరగ్గా.. రేవతి అనే మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే రేవతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. శ్రీతేజ్ వైద్య ఖర్చు మొత్తాన్ని భరిస్తుంది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. అంతకుముందు అల్లు అర్జున్ కూడా నష్ట పరిహారం ప్రకటించారు. రేవతి ఫ్యామిలీకి అండగా ఉంటామని తెలిపారు.
ఇప్పుడు తొక్కిసలాట ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారం స్పందించింది. బాధిత కుటుంబానికి అండదండలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఛాంబర్ సభ్యులు విరాళాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసింది. అందులో విరాళాలు వేయాల్సిన బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చింది.
"2024 డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 ప్రీమియర్ షో టైమ్ లో జరిగిన ఘటన.. విచారకరమైనది. అది చాలా దురదృష్టకరం. అందుకు తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులైన మేం మా వంతు బాధ్యతగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న చిన్నారికి అండగా నిలవనున్నాం" అని TFCC ప్రెస్ నోట్ లో తెలిపింది.
రేవతి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా కొంత మొత్తాన్ని విరాళంగా అందించాలని ప్లాన్ చేస్తున్నామని TFCC తెలిపింది. అందుకే విరాళం ఇవ్వాలని అనుకునేవారు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఛాంబర్ బ్యాంక్ అకౌంట్ కు విరాళాలు పంపాలని అభ్యర్థిస్తున్నట్లు పేర్కొంది.
అయితే రేవతి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబిత.. రేవతి భర్తకు ఆస్పత్రిలో రూ.5 లక్షల చెక్కును అందించనున్నట్లు తెలుస్తోంది. రేవతి ఫ్యామిలీకి అండగా ఉంటామని రీసెంట్ గా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన తర్వాత అల్లు అరవింద్ ప్రకటించారు. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న శ్రీతేజ్ ను మూములు స్థితికి తీసుకురావాలని వైద్యులు కృషి చేస్తున్నారు.