Begin typing your search above and press return to search.

కోర్టు సూచ‌న మేర‌కు గోప్య‌త కాపాడాలి: ఫిలింఛాంబ‌ర్

బాధిత పక్షం పోలీస్ శాఖ‌కు ఫిర్యాదు చేయ‌గా FIR నమోదు చేసారని మాకు తెలిసింది.

By:  Tupaki Desk   |   16 Sep 2024 4:28 PM GMT
కోర్టు సూచ‌న మేర‌కు గోప్య‌త కాపాడాలి: ఫిలింఛాంబ‌ర్
X

''తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియన్‌లో సభ్యులైన కొరియోగ్రాఫర్ లైంగిక‌ వేధింపులకు పాల్ప‌డ్డార‌నే ఫిర్యాదును తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కి బాధితురాలు ఇచ్చారు. దానిని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ 'వేధింపుల పరిష్కార ప్యానెల్‌'కు సిఫార్సు చేసింద‌''ని ఒక ప్ర‌క‌ట‌న‌లో ఛాంబ‌ర్ గౌర‌వ కార్య‌ద‌ర్శి దామోద‌ర్ ప్ర‌సాద్ వెల్ల‌డించారు.


ఆయ‌న మీడియాకు పంపిన నోట్ లో ఇలా ఉంది.''కొరియోగ్రాఫ‌ర్ పై ఫిర్యాదు విష‌యంలో అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశం అయ్యి POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగిస్తుంది. బాధిత పక్షం పోలీస్ శాఖ‌కు ఫిర్యాదు చేయ‌గా FIR నమోదు చేసారని మాకు తెలిసింది. భాదిత పార్టీల గోప్యతను కాపాడాలని మేము అన్ని మీడియా సంస్థలను, ప్రింట్- డిజిటల్- ఎలక్ట్రానిక్ మీడియాలను అభ్యర్ధిస్తున్నాము. సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం ఈ సమస్యకు ప‌రిష్కారం ల‌భించే వరకు సంబంధిత వ్యక్తుల ముసుగులు లేని ఫొటోగ్రాఫ్ లను, వీడియోలను ఉపయోగించవద్ద‌ని, ఈపాటికే ఉపయోగించినట్లైతే వాటిని వెంటనే తొల‌గించ‌మని అభ్యర్ధిస్తున్నాం'' అని పేర్కొన్నారు.


ప్రముఖ కొరియోగ్రాఫ‌ర్ పై త‌న మ‌హిళా అసిస్టెంట్ ఒక‌రు వేధింపుల‌కు గురి చేసార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా దీనిపై ఎఫ్‌.ఐ.ఆర్ న‌మోదైంది. మాలీవుడ్ లో జ‌స్టిస్ హేమ క‌మిటీ రిపోర్ట్ వెల్ల‌డ‌య్యాక టాలీవుడ్ లో కొత్త‌ ప‌రిణామ‌మిది. మాలీవుడ్ లో ఈ త‌ర‌హా కేసులు న‌మోద‌వుతున్న వేళ తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి ఈ కేసు న‌మోద‌వ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొంత కాలంగా సినీప‌రిశ్ర‌మ‌ల్లో వాతావ‌ర‌ణం స్థ‌బ్ధుగా మారింది.