Begin typing your search above and press return to search.

తలైవా సినిమా అంటే ఇలానే ఉండాలని ఫిక్స్ అయ్యారా?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జ్ఞానవేల్ మాట్లాడుతూ.. రజనీకాంత్ అభిమానులను అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో సినిమాను రూపొందించడమే నా మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నానని చెప్పారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 3:15 AM GMT
తలైవా సినిమా అంటే ఇలానే ఉండాలని ఫిక్స్ అయ్యారా?
X

సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు సెట్స్ మీదకు తీసుకొస్తున్నారు. వాటిల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటే, మరికొన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే, ప్రతీ చిత్రంలోనూ రొటీన్ మాస్ ఎలిమెంట్స్ ఉంటున్నాయి. ఏ డైరెక్టర్ తో వర్క్ చేసినా సరే, కమర్షియాలిటీ పేరుతో తలైవా స్టైల్ మ్యానరిజాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

రజనీకాంత్ గత కొంతకాలంగా తన ఏజ్ కు తగ్గ పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. కొత్త ఆలోచనలతో వచ్చే నేటితరం దర్శకులను ఎంపిక చేసుకుంటూ, సరికొత్త కథలతో సినిమాలు చేస్తున్నారు. కానీ అభిమానులు తన నుంచి ఆశించే అంశాలు ఉండాలంటూ.. సినిమాలో అవసరం లేకున్నా మాస్ ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటున్నారు. రజనీ రీసెంట్ గా 'వేట్టయన్: ది హంటర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి టీజే జ్ఞానవేల్ దర్శకుడు.

స్వతహాగా జర్నలిస్టు అయిన జ్ఞానవేల్.. 'జై భీమ్' సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే జాతీయ స్థాయిలో అందరి ప్రశంసలు అందుకున్నాడు. తాను రెగ్యులర్ డైరెక్టర్ కాదని ఫస్ట్ మూవీతోనే చెప్పకనే చెప్పారు. సూర్య లాంటి స్టార్ హీరోని పెట్టుకొని కూడా, ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా తాను చెప్పాలనుకున్న కథను నిజాయితీగా చెప్పారు. కానీ ఇప్పుడు 'వేట్టయన్' సినిమాతో కమర్షియల్ ఫార్మాట్ లోకి వచ్చేశారు.

'వేట్టయన్' ద్వారా జ్ఞానవేల్ బలమైన పాయింట్ నే చెప్పాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ కథానాయకుడు రజనీకాంత్ అవ్వడం వల్ల, ఆయన ఇమేజ్ ను మ్యాచ్ చెయ్యడానికి సీరియస్ కథలో మాస్ అంశాలను జోడించారు. దీని కారణంగా దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని అంత ఎఫెక్టివ్ గా చెప్పలేకపోయారని, సినిమాకి మిశ్రమ స్పందన రావడానికి ఇదే కారణమని కామెంట్లు వస్తున్నాయి. ఫేక్ ఎన్కౌంటర్ చుట్టూ అద్భుతమైన డ్రామా పండించవచ్చని, కమర్షియాలిటీ జోలికి వెళ్లకుండా తీసుంటే రిజల్ట్ వేరేలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జ్ఞానవేల్ మాట్లాడుతూ.. రజనీకాంత్ అభిమానులను అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో సినిమాను రూపొందించడమే నా మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నానని చెప్పారు. అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ, తలైవా ఫ్యాన్స్ ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టాల్సి వచ్చిందని అన్నారు. ఈ కథలో రజినీ స్టైల్, మ్యానరిజంను జోడించడమే తనకు ఎదురైన అతి పెద్ద సవాల్ గా పేర్కొన్నారు. ఫ్యాన్స్ తన నుంచి ఏం కోరుకుంటారో రజనీకి బాగా తెలుసని, అందుకే యాక్షన్ సీక్వెన్స్‌లను కథనంలో అంతర్లీనంగా ఉండేలా చూసుకున్నానని దర్శకుడు తెలిపారు.

గతంలో కార్తీక్ సుబ్బరాజ్ విషయంలోనూ ఇలానే జరిగింది. కోలీవుడ్ లో విలక్షణ దర్శకుడిగా పేరున్న కార్తీక్.. 'పేట' సినిమాకి మాత్రం రజినీకాంత్ స్టైల్ లోకి మారిపోయారు. కథ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా.. ఎలివేషన్ ఫైట్స్, మేనరిజమ్స్ తో తీయడం వల్లనే బ్లాక్ బస్టర్ అవ్వలేదనే కామెంట్స్ వచ్చాయి. అభిమానులు రజినీకాంత్‌ను ఎలా చూడాలని కోరుకుంటారో, ఎలా చూపిస్తే సంతోషిస్తారనే ఆలోచనలే దర్శకులను ట్రాక్ తప్పేలా చేస్తున్నాయని అర్థమవుతోంది.

అయితే ఇవేమీ ఫాలో అవ్వకుండా, భారీ యాక్షన్ సీన్స్ లేకుండానే నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్' సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడనే సంగతి మిగతా దర్శకులు మర్చిపోకూడదు. రజనీకాంత్ ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో 'కూలీ' సినిమాలో నటిస్తున్నారు. మరి తలైవాతో లోకేష్ ఎలాంటి సినిమా తీస్తారో చూడాలి.