సౌత్‌లో హిందీ టాప్ డిస్ట్రిబ్యూటర్ గేమ్ ప్లాన్
సౌత్ నుంచి హిందీలోకి అనువాదమవుతున్న చాలా సినిమాలను తడానీ కి చెందిన ఏఏ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది
By: Tupaki Desk | 17 April 2024 11:30 PMఉత్తరాది పంపిణీ వర్గాలకు సౌత్ ట్యాలెంట్ కోట్లలో లాభాలందిస్తోంది. ఉత్తరాదిన ప్రయోగాత్మక కంటెంట్ ని మించి దక్షిణాదికి చెందిన కమర్షియల్ సినిమా కంటెంట్ ఉత్తరాది ఆడియెన్ ని మెప్పిస్తోంది. హిందీ బెల్ట్‌కు చెందిన తడానీ గ్రూప్ కి చెందిన ఏఏ ఫిలింస్ సంస్థ ఏకంగా దక్షిణాదిన తెరకెక్కుతున్న భారీ క్రేజీ చిత్రాలను ఒడిసిపడుతోంది. హిందీ మార్కెట్ లో రిలీజ్ హక్కులను భారీ మొత్తాలను వెచ్చించి మరీ మార్కెట్ లో పోటీ అన్నదే లేకుండా చాలా ముందే తడానీలు ఛేజిక్కించుకుంటున్నారు. దీనికోసం కోట్లాది రూపాయల బిగ్ గ్యాంబుల్ జరుగుతోంది.
సౌత్ నుంచి హిందీలోకి అనువాదమవుతున్న చాలా సినిమాలను తడానీ కి చెందిన ఏఏ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. ప్రతియేటా అద్భుతమైన బ్లాక్ బస్టర్లతో సత్తా చాటుతోంది ఈ సంస్థ. 2024లో మోస్ట్ అవైటెడ్ జాబితాలో ఉన్న అన్ని దక్షిణాది చిత్రాలను తడానీలు ఛేజిక్కించుకోవడం ఆశ్చర్యకరం. ప్రభాస్ నటిస్తున్న `కల్కి`, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న `దేవర` (ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిపి తడానీలు తీసుకున్నారు), రామ్ చరణ్ - శంకర్ కలయికలో వస్తున్న `గేమ్ ఛేంజర్` ఇవన్నీ తడానీలకు చెందిన ఏఏ ఫిల్మ్స్ ద్వారానే నార్త్ లో పంపిణీ అవుతున్నాయి. బాహుబలి- కేజీఎఫ్- కాంతార- పుష్ప వంటి చిత్రాల్ని రిలీజ్ చేసి భారీగా లాభాలార్జించిన తడానీలు సౌత్ లో మేలిమి చిత్రాలన్నిటినీ ఏరి కోరి కొనుగోలు చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది.
ప్రస్తుతం ఉత్తరాది బెల్ట్ లో సౌత్ హవా కొనసాగుతోంది. అదే క్రమంలో సౌత్ నుంచి ప్రతిభావంతులైన దర్శకహీరోల కలయికలో రూపొందుతున్న భారీ ప్రాజెక్టులన్నిటినీ తడానీలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం తడానీల బిజినెస్ స్ట్రాటజీ ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా హిందీ ఫిలింమేకర్స్ ని నమ్మకుండా ఇప్పుడు సౌత్ ట్యాలెంట్ ని నమ్మి పెట్టుబడులు పెడుతుండడం చర్చనీయాంశంగా మారింది.