Begin typing your search above and press return to search.

త‌ళా అజిత్‌తో మైత్రి మూవీ టైటిల్ ఇదే

త‌ళా అజిత్ కుమార్ కొన్నేళ్లుగా తన అసాధార‌ణ నటనతో ప్ర‌జ‌ల‌ హృదయాలను దోచుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   14 March 2024 6:30 PM GMT
త‌ళా అజిత్‌తో మైత్రి మూవీ టైటిల్ ఇదే
X

త‌ళా అజిత్ కుమార్ కొన్నేళ్లుగా తన అసాధార‌ణ నటనతో ప్ర‌జ‌ల‌ హృదయాలను దోచుకుంటున్నాడు. అతడి సాహ‌సోపేత‌మైన ఎంపిక‌లు ఎప్పుడూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. విల‌క్ష‌ణ‌మైన‌ పాత్రలతో అత‌డు బలమైన ముద్ర వేశారు. తునివు, వాలిమై, నేర్కొండ పార్వై, విశ్వాసం, వివేగం, వేదాళం, యెన్నై అరిందాల్, వీరం, బిల్లా (పార్ట్ 1 అండ్ 2), కిరీడం, ఆళ్వార్ స‌హా మరెన్నో సూపర్ హిట్ సినిమాల్లో అజిత్ కుమార్ న‌టించారు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన అజిత్ 1990లో `ఎన్ వీడు ఎన్ కనవర్` అనే చిత్రంతో తెరంగేట్రం చేశాడు. అతడు చివరిగా `తునివు` చిత్రంలో న‌టించాడు. స్వ‌త‌హాగా అజిత్ రేసింగ్ ను ఇష్ట‌ప‌డ‌తాడు. విలాసవంతమైన కార్లు బైక్ లు న‌డ‌ప‌డంలో అసాధార‌ణ ప‌నిమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. అజిత్ వేల కిలోమీట‌ర్ల బైక్ రైడ్ లు, కార్ రేస్ లో ఆశ్చ‌ర్య‌పరుస్తాయి.

అత‌డు రియ‌ల్ లైఫ్ లో రియ‌ల్ ఛాలెంజ‌ర్ గా సాహ‌సికుడిగా అభిమానుల గుండెల్లో నిలిచి ఉన్నాడు.

ఇప్పుడు అలాంటి విల‌క్షణుడు అయిన‌ అజిత్ తో క‌లిసి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్ ఇంత‌కుముందే విడుద‌లైంది. ఈ సినిమా టైటిల్ `గుడ్ బ్యాడ్ అగ్లీ`. త‌ళా అజిత్ కుమార్ పెర్ఫామెన్స్ కి మాస్ ఫాలోవ‌ర్స్ కి యాప్ట్ అయ్యే టైటిల్ ఇద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

టైటిల్ ఎత్తుగ‌డ‌తోనే త‌ళా తొలి విజ‌యం సాధించాడు. మైత్రికి ఇది పాజిటివ్ సంకేతం అని అర్థ‌మవుతోంది. భారీ మాస్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూన్‌లో ప్రారంభించి న‌వంబ‌ర్ నాటికి పూర్తి చేస్తారు. 2025 పొంగల్‌కు విడుదల కానుంది. ఇది తమిళం, తెలుగులో విడుద‌ల‌వుతుంది. ద‌ళ‌పతి విజయ్ `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` అదే సమయంలో విడుదల కావచ్చని కూడా టాక్ ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని - వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీకి 2014 చిత్రం వీరమ్ కి సంగీతం అందించిన స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, విజయ్ వేలుకుట్టి ఎడిటర్‌గా ఉన్నారు.

అజిత్ , ఆధిక్ ల గురించి ప్ర‌స్థావిస్తే.. హెచ్ వినోద్ తునివులో చివరిగా కనిపించిన అజిత్ ప్రస్తుతం మగిజ్ తిరుమేని `విదా ముయార్చి`లో న‌టిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. విశాల్ - SJ సూర్య నటించిన మార్క్ ఆంటోనికి చివరిగా దర్శకత్వం వహించిన అధిక్ రవిచంద్రన్ ఇప్పుడు త‌ళాను డైరెక్ట్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.