తలపతి 69 - తెలుగు రీమేకా?
తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ నటించిన సినిమాలు ఇటీవలి కాలంల ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా, ఆయన క్రేజ్ మాత్రం ఆకాశమే హద్దుగా ఉంది
By: Tupaki Desk | 2 Oct 2024 6:07 AM GMTతమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ నటించిన సినిమాలు ఇటీవలి కాలంల ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా, ఆయన క్రేజ్ మాత్రం ఆకాశమే హద్దుగా ఉంది. విజయ్ నటించిన 'ది గోట్' మూవీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయింది. అంతకుముందు వచ్చిన ‘లియో’ కూడా ఫ్యాన్స్ అంచనాలకు న్యాయం చేయలేకపోయింది. అయినప్పటికీ, విజయ్ అభిమానుల్లో అతని తదుపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తలపతి 69 విజయ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు వినోత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంపై ఇప్పటికే అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. అనిరుద్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా ఉండబోతుందట. అనిరుద్, విజయ్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉండటంతో మ్యూజిక్ రైట్స్ కోసం పోటీ గట్టిగానే ఉండనుంది.
తాజా సమాచారం ప్రకారం, పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్ లాంటి స్టార్ నటులు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారని తెలుస్తోంది. మరో విశేషం ఏమిటంటే, మలయాళ సినిమాలో ‘ప్రేమాలు’ ద్వారా సెన్సేషన్‌గా మారిన మమతా బైజు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. ఈ కారణంగా ఈ చిత్రం పై మరింత ఆసక్తి పెరిగింది.
ఇది మాత్రమే కాకుండా, తలపతి 69 సినిమా తెలుగు సూపర్ హిట్ సినిమాకి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ రీమేక్ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సి ఉంది. ఆమధ్య నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి అన్నట్లు టాక్ వచ్చింది. కానీ ఆ విషయంలో సరైన క్లారిటీ లేదు.
తలపతి 69 సినిమా ప్రచార పోస్టర్ పై ఉన్న "ది టార్చ్ బెయరర్ ఆఫ్ డెమోక్రసీ" అనే క్యాప్షన్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో ఉండబోతోందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా తలపతి విజయ్ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనది కానుందని సమాచారం. తలపతి 69 విజయ్ నటించే చివరి సినిమా కావొచ్చని, ఆ తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ, తన అభిమానులకు చివరిగా ఒక పవర్‌ఫుల్ కథతో చిత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, తలపతి విజయ్ 69వ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, అధికారిక ప్రకటనలు త్వరలో రానున్నాయి. మరి రాజకీయ నేపథ్యంతో సాగే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.