రాజకీయాలపై బిగిలూ ఏమన్నాడంటే?
తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పీ చెప్పనట్టు హింట్ ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కార్యక్రమంలో RJ విజయ్ దళపతిని రాజకీయాల గురించి ప్రశ్నించాడు.
By: Tupaki Desk | 2 Nov 2023 1:53 PM GMTనిన్న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన 'లియో' సక్సెస్ మీట్‌కు దళపతి విజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం కూడా హాజరైంది. వేదికపై దళపతి తన ప్రసంగంతో అహూతుల హృదయాలను గెలుచుకున్నాడు. అతడు తనపై తమిళనాడు వ్యాప్తంగా అశేషమైన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇదే వేదికపై తన రాజకీయ ఆశయాల గురించి కూడా అతడు ఛూఛాయగా హింట్ ఇచ్చేశాడు.
తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పీ చెప్పనట్టు హింట్ ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కార్యక్రమంలో RJ విజయ్ దళపతిని రాజకీయాల గురించి ప్రశ్నించాడు. 2026 గురించి అడిగినప్పుడు దళపతి విజయ్ స్పందిస్తూ, ''ఇది 2025 తర్వాత వస్తుంది'' అని సరదాగా వ్యాఖ్యానించాడు.
తర్వాత ఆ సంవత్సరం ఫుట్ బాల్ వరల్డ్ కప్ జరుగుతుందన్నాడు. 'కప్పు ముఖ్యం బిగిలూ' అంటూ తన సినిమా బిగిల్ నుంచి డైలాగ్ తో హుషారు పెంచాడు. ఓవరాల్ గా అతడు తన రాజకీయారంగేట్రానికి ఆసక్తిగా ఉన్నానని హింట్ ఇచ్చాడు. గతంలో దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై రకరకాల వార్తలు వచ్చాయి. మీడియా కథనం ప్రకారం, 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావడానికి 2024 జనవరి నుంచి దాదాపు రెండేళ్లపాటు సినిమాలకు విరామం తీసుకునే అవకాశం ఉంది.
జూలై నెలలో, తమిళనాడు అంతటా దళపతి విజయ్ పాదయాత్ర (రాజకీయ పర్యటన) ప్లాన్ చేసినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల మధ్య అతడు 'విజయ్ మక్కల్ ఇయక్కం' సభ్యులను కలుసుకోవడం సందడి వాతావరణాన్ని తెచ్చింది. ఇది దళపతి సంభావ్య రాజకీయ జీవితం గురించి ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. అయితే రాజకీయాల్లోకి వస్తున్నాను అని అతడు అధికారికంగా మాత్రం ఇంకా ధృవీకరించబడలేదు. 2024లో ఆయన తన రాజకీయ పార్టీని ప్రారంభించి 2026 ఎన్నికలలో పాల్గొంటారని ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయి.
దళపతి విజయ్ ప్రస్తుతం 'లియో' భారీ విజయాన్ని ఆస్వాధిస్తున్నాడు. యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌ను ఎస్ఎస్ లలిత్ కుమార్- జగదీష్ పళనిసామి నిర్మించారు. ఇందులో నటీనటులు సంజయ్ దత్, త్రిష కృష్ణన్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్ కీలక పాత్రలు పోషించారు. వెంకట్ ప్రభు రచన- దర్శకత్వంలో దళపతి 68 కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, మోహన్, జయరామ్, అజ్మల్ అమీర్, యోగి బాబు, VTV గణేష్, వైభవ్, ప్రేమి అమరేన్, అరవింద్ ఆకాష్ , అజయ్ రాజ్ తదితరులు నటించనున్నారు.
కరుణానిధి అవుతాడా? కమల్ హాసన్ అవుతాడా?
దళపతి విజయ్ రాజకీయారంగేట్రం నేపథ్యంలో చాలా మంది అతడి గురించి ఆన్ లైన్ లో ఆసక్తికర డిబేట్లతో ముందుకు వస్తున్నారు. విజయ్ తమిళనాడు రాజకీయాల్లో మరో కరుణానిధి అవుతాడా లేక కమల్ హాసన్ అవుతాడా? అన్నదే ఈ చర్చ. తమిళనాడును పలుమార్లు ముఖ్యమంత్రిగా ఏలిన ఘనత కరుణానిధి సొంతం. అయితే కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టినా కానీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. తమిళనాట రాజకీయాల్ని శాసించేది సినిమా వాళ్లే. కానీ ఆ పనిలో దళపతి ఎంతవరకూ సక్సెసవుతాడన్నది ఇప్పటికి సస్పెన్స్.